అమెరికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించేవారిలో మూడో స్థానంలో భార‌తీయులు

అమెరికా (America) లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించే దేశ‌స్థుల్లో భార‌తీయులు (Indians) మూడో స్థానంలో ఉన్న‌ట్లు ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

  • Publish Date - November 23, 2023 / 09:12 AM IST

విధాత‌: అమెరికా (America) లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించే దేశ‌స్థుల్లో భార‌తీయులు (Indians) మూడో స్థానంలో ఉన్న‌ట్లు ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ద ప్యూ రీస‌ర్చ్ సెంట‌ర్ రూపొందించిన ఈ నివేదిక (Study) ప్ర‌కారం.. సుమారు 7,25,000 మంది భార‌తీయులు అమెరికాలో స‌రైన ప‌త్రాలు లేకుండా అక్ర‌మంగా నివాసం ఉంటున్నార‌ని తెలిపింది. మెక్సికో, ఎల్‌సాల్వెడార్ దేశాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయ‌ని ఈ నివేదిక పేర్కొంది.


అందులోని వివ‌రాల ప్ర‌కారం.. మొత్తంగా ఇలాంటి వారు ఒక కోటి మంది ఉండ‌గా.. విదేశాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఉంటున్న వారి జ‌నాభాలో ఇది 22 శాతంగా ఉంది. 2022 అక్టోబ‌ర్ నుంచి సెప్టెంబ‌ర్ 2023 మ‌ధ్య సుమారు 6917 ఘ‌ట‌న‌ల్లో భార‌తీయులు అక్ర‌మంగా ప్ర‌వేశిస్తుండ‌గా నిలువ‌రించిన‌ట్లు యూఎస్ క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ డేటా చెబుతోంది.


కొవిడ్ 19 త‌ర్వాత స‌రిహ‌ద్దు వ‌ద్ద నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో చొర‌బాట్లు పెరిగాయి. 2022లో మొత్తం ఇలాంటివి 63,927 ఘ‌ట‌న‌లు అధికారుల దృష్టికి రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 97 వేలకు చేరింది. మెక్సికోను మిన‌హాయిస్తే మిగ‌తా దేశాల నుంచి అక్ర‌మ మార్గాల్లో వ‌స్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2017లో తొమ్మిది ల‌క్ష‌ల మంది స‌రిహ‌ద్దులు దాటితే.. 2021లో ఆ సంఖ్య 60 ల‌క్ష‌ల‌కు చేరింది అని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. వీరిలో ప్ర‌పంచంలోని ప్ర‌తి ప్రాంతం వారూ ఉంటున్నార‌ని పేర్కొంది.


అయితే సెంట్ర‌ల్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వ‌చ్చే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంద‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు. వీరంతా ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండే కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌, న్యూ జెర్సీ, ఇలినాయిస్ త‌దిత‌ర ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

Latest News