Site icon vidhaatha

Ind vs Wi | వెస్టిండీస్‌పై చిత్తుగా ఓడిన భార‌త్.. సిరీస్ ద‌క్కించుకున్న క‌రీబియ‌న్స్

Ind vs Wi |

విధాత: వెస్టిండీస్ టూర్‌లో టెస్ట్ సిరీస్‌, వ‌న్డే సిరీస్ గెలిచిన భార‌త్ జ‌ట్టు టీ 20 సిరీస్‌లో తేలిపోయింది. హార్ధిక్ సేన నేతృత్వంలోని కుర్రాళ్ల జ‌ట్టు మూల్యం చెల్లించుకుంది. మొద‌టి రెండు టీ 20లు ఓడిన భార‌త జ‌ట్టు ఆ త‌ర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచింది. కాని డిసైడ‌ర్ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయి సిరీస్‌కి విండీస్‌కి అప్ప‌గించింది.

నాలుగో టీ 20 మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఘన విజయం అందుకున్న తర్వాత కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హార్ధిక్ పాండ్యాఅటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట‌ర్‌గా, బౌల‌ర్‌గా నిరాశ‌ప‌రిచాడు. హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్ పరాజయం కాగా, టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా కూడా ఓ చెత్త రికార్డ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఐదో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు హార్ధిక్ పాండ్యా. బ్యాటింగ్‌కి వ‌చ్చిన య‌శ‌స్వి, గిల్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. యశస్వి జైస్వాల్ 5 ప‌రుగులు చేసి ఔట్ కాగా, శుబ్‌మన్ గిల్ 9 పరుగులకి ఔట‌య్యాడు. దీంతో 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది టీమిండియా. ఆ ద‌శ‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం అందించారు.

అయితే తిలక్ వర్మ ( 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి) చేజ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. సంజూ శాంస‌న్ (9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఒక్క సూర్య కుమార్ యాద‌వ్( 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ స్కోర్ చేయ‌డంతో భార‌త్ వెస్టిండీస్ ముందు 166 ప‌రుగుల టార్గెట్ ఉంచింది.

అయితే 166 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్స్‌ని భార‌త బౌల‌ర్స్ ఏ మాత్రం ఇబ్బంది పెట్ట‌లేక‌పోయారు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ కలిసి శతాధిక భాగస్వామ్యం నెల‌కొల్పి మ్యాచ్ విండీస్ వైపుకి వ‌చ్చేలా చేశారు. బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ కలిసి రెండో వికెట్‌కి 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్ప‌డంతో టార్గెట్ చేధించ‌డం సులువు అయింది.

అయితే ఓటమి దాదాపు ఖరారైన స‌మయంలో తిలక్ వర్మకి బాల్ ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి బౌలింగ్ చేసిన తిల‌క్ తాను వేసిన రెండో బంతికి నికోలస్ పూరన్‌ని అవుట్ చేశాడు. నికోలస్ పూరన్ ( 35 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు) ఔట‌యిన కూడా బ్రెండన్ కింగ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులు , షై హోప్ 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు. క‌నీసం వ‌ర‌ల్డ్ క‌ప్ అర్హ‌త సాధించ‌లేక‌పోయిన విండీస్ జ‌ట్టుకి ఈ విజ‌యం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది.

Exit mobile version