-యూపీఏ పాలనపై మోదీ మాటల్లో నిజమెంత
-గడిచిన ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి
విధాత: దేశం ఓ దశాబ్ద కాలాన్ని కోల్పోయింది.. అంటూ పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2004-14 యూపీఏ పాలనను విమర్శించారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో సాగిన ఈ పదేండ్లపై మోదీ అన్న మాటల్లో నిజమెంత? ఒక్కసారి గణాంకాలను పరిశీలిస్తే..
-2004-14లో భారత జీడీపీ వృద్ధిరేటు ఏటా 8 శాతంగా నమోదైంది. 2008లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడింది. జనాభా ఏటా 1.3 శాతం పెరగగా, తలసరి ఆదాయం ఈ పదేండ్లూ సగటున 6.7 శాతానికి పెరిగింది.
-2004-05 నుంచి 2011-12 మధ్య వ్యవసాయేతర రంగాల్లో ఏటా 75 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడేండ్లలో 5.2 కోట్ల కొత్త కొలువుల సృష్టి జరిగింది. అందుకే యువతలో నిరుద్యోగితా రేటు చాలా తక్కువగా నమోదైంది. ఈ కారణంగానే ఏటా వ్యవసాయ రంగం నుంచి 50 లక్షలకుపైగా మంది ఉపాధి కోసం బయటి రంగాలకు వెళ్లారు. నిజానికి 1973-74 నుంచే వ్యవసాయ రంగంలో కార్మికుల వాటా పడిపోతున్నది. కానీ 2004-05 తర్వాతే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది.
-యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ సృష్టి పెద్ద ఎత్తున జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో జీతాలు పెరిగాయి. మరోవైపు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర లభించింది.
-వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పన ఊపందుకోవడం, వాస్తవ వేతనాలు పెరగడంతో పేదరికం తగ్గుముఖం పట్టింది. దీంతో 2004-12లో ఆర్థిక వృద్ధిలోనే కాదు.. పేదరిక నిర్మూలనలోనూ భారత్ పరుగులు పెట్టింది. ఏటా దాదాపు 2 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువ తరగతి నుంచి బయటకొచ్చారు.
-చదువుకున్న వారిలో నిరుద్యోగితా రేటు 2004-05 నుంచి 2011-12 మధ్య బాగా తగ్గినట్టు ఎన్ఎస్‌వో లేబర్ ఫోర్స్ సర్వేలే చెప్తున్నాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడే యువతలో నిరుద్యోగ రేటు రెట్టింపునకుపైగా పెరిగింది.
మోదీ హయాంలో జరిగింది ఇదీ..
-2014-2019 మధ్య వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ సృష్టి ఏటా 75 లక్షల నుంచి 29 లక్షలకు పడిపోయింది.
-2014 నుంచే దేశ జీడీపీ వృద్ధిలో కీలకమైన తయారీ రంగం కుదేలైంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉద్యోగాలు బాగా పడిపోయాయి. మేక్ ఇన్ ఇండియాతోనూ ఫలితం లేదు. ఇక 2016లో పాత పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితులు మరింతగా దిగజారాయి. జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 13 శాతానికి క్షీణించింది.
-కరోనా నేపథ్యంలో ఉద్యోగ కోతలు ఇంకా పెరిగాయి. కరోనా కేసులు తగ్గినా అసంఘటిత తయారీ, సేవా రంగాలు కోలుకోలేకపోయాయి. ఫలితంగా మార్కెట్‌లో సంఘటిత రంగం వాటా పెరిగిపోయింది. ఈ పరిణామం సమాజంలో అసమానతలకు దారి తీసింది.
-చదువుకున్న నిరుద్యోగులు 2012లో 2.2 శాతంగా ఉంటే.. 2017-18లో 6.1 శాతానికి పెరిగారని ఎన్ఎస్ఎస్‌వో గణాంకాలే చెప్తున్నాయి. గడిచిన 45 ఏండ్లలోనే ఇది అత్యంత గరిష్ఠం. 2017-18లో నిరుద్యోగ సంక్షోభానికి నోట్ల రద్దు కూడా కారణమే. 2012-19 మధ్య నిరుద్యోగ యువత రెట్టింపైంది. కరోనా సమయంలో ఆర్థిక, ఆరోగ్య, ఉపాధి సంక్షోభం తీవ్రంగా ఉన్నది.
-జీతాల పెరుగుదల నెమ్మదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదయోగ్య స్థాయి కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటున్నది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంపైనే నమోదవుతున్నది. దేశంలో పేదరికం పెరగడానికి ఇదికూడా కారణమేనని ప్రపంచ బ్యాంక్ నివేదికలే చెప్పాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది దారిద్య్రంలోకి జారుకోగా, 5.6 కోట్ల మంది భారతీయులేనని తేలింది.