న్యూఢిల్లీ: దేశంలో సమస్యలన్నింటినీ గ్రీన్‌మ్యాట్‌ల కింద దాచేసి.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైకి డాంబికాలు పలుకుతున్నా.. అంతర్జాతీయ సూచీలు మాత్రం బీజేపీ పాలన డొల్లతనాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నాయి. అనేక సూచీల్లో భారత ర్యాంకు గణనీయంగా పడిపోతున్నది. తాజాగా శక్తిమంతమైన పాస్‌పోర్టు ర్యాంకుల్లో సైతం భారత్ స్థానం దిగజారిపోయింది.
మొత్తం 194 దేశాల జాబితాలో గత ఏడాది భారత్ స్థానం 84గా ఉంటే.. ఈ ఏడాది అది ఒక ర్యాంకు కోల్పోయి.. 85వ స్థానానికి చేరుకున్నది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆయా దేశాల పాస్‌పోర్టులను విశ్లేషించి, శక్తిమంతమైనవి ఏవో, బలహీనమైనవి ఏవో ప్రకటిస్తుంటుంది. ఈసారి 194 దేశాల పాస్‌పోర్టుల పనితీరును విశ్లేషించగా ఫ్రాన్స్ పాస్‌పోర్టు అత్యంత శక్తమంతమైనదిగా అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 106వ స్థానంలో ఉన్నది.
గతంలో వీసా లేకుండా 60 దేశాలను సందర్శించేందుకు భారత్ పాస్‌పోర్టు వీలు కల్పిస్తుంది. దానిని గత ఏడాది 62 దేశాలకు విస్తరించినా కూడా మన ర్యాంకు ఒక స్థానం పడిపోవడం గమనార్హం. జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు ఫ్రాన్స్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాదేశ్ కూడా 101వ ర్యాంకు నుంచి 102వ ర్యాంకు వెళ్లింది. భారత్ పొరుగు దేశాలైన మాల్దీవులు పాస్‌పోర్ట్ బలమైన పాస్‌పోర్టుగా 58వ స్థానంలో స్థిరంగా ఉన్నది. మాల్దీవుల పాస్‌పోర్టుతో వీసా లేకుండా 96 దేశాలను సందర్శించవచ్చు.
ఇరాన్, మలేసియా, థాయిలాండ్ దేశాలు భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ విజిటింగ్ సదుపాయాన్ని ప్రకటించినా కూడా భారత ర్యాంకు దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాల పాస్‌పోర్టులు, 227 పర్యాటక ప్రదేశాలను కలుపుకొంటూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డాటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. తన ఇండెక్స్‌ను ప్రతి నెలా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.