India-Pak | ఇండియా-పాక్ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ తేదీ మార్పు!

India-Pak World Cup భద్రత అంశాలతోనే రీషెడ్యూల్‌? అక్టోబర్‌ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలు భద్రత కల్పించడం కష్టసాధ్యమన్న స్థానిక పోలీసులు! నేడు అన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల భేటీలో నిర్ణయం అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అహ్మదాబాద్‌లో జరిగే వన్డే మ్యాచ్‌ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ముందు అనుకున్న ప్రకారం ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగాల్సి ఉన్నది. షెడ్యూల్‌ మార్పుపై బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన […]

  • Publish Date - July 26, 2023 / 10:19 AM IST

India-Pak World Cup

  • భద్రత అంశాలతోనే రీషెడ్యూల్‌?
  • అక్టోబర్‌ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలు
  • భద్రత కల్పించడం కష్టసాధ్యమన్న స్థానిక పోలీసులు!
  • నేడు అన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల భేటీలో నిర్ణయం

అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అహ్మదాబాద్‌లో జరిగే వన్డే మ్యాచ్‌ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ముందు అనుకున్న ప్రకారం ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగాల్సి ఉన్నది.

షెడ్యూల్‌ మార్పుపై బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. భద్రతాపరమైన అంశాలతో తేదీ మార్చే అవకాశం ఉన్నదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. భద్రతా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

అక్టోబర్‌ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. దీనిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట గార్బా వేడుకలు చేసుకుంటారు. ఆ రోజు నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడం కష్టంగా మారుతుందని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఈ అంశాన్ని బీసీసీఐ ప్రతినిధులు ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. న్యూఢిల్లీలో శుక్రవారం అన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

అక్టోబర్‌ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అసలే అహ్మదాబాద్‌లో జరిగేది హై టెన్షన్‌తో సాగే భారత్‌, పాక్‌ మ్యాచ్‌. దీనికి భద్రతా బలగాల మోహరింపు కూడా భారీగానే అవసరం ఉంటుందని స్థానిక పోలీసు అధికారులు తమను సంప్రదించారని, తేదీ మార్చాలని కోరాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ముందుకు జరుపుతారా?

15వ తేదీ మ్యాచ్‌ను 14 తేదీనే నిర్వహిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. అదే జరిగితే మొత్తం షెడ్యూల్‌పై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా.. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం టికెట్లు, హోటళ్లు బుక్‌ చేసుకున్న అభిమానులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది.

ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న చెన్నైలో ఆడనున్నది. పాకిస్థాన్‌ మొదటి రెండు మ్యాచ్‌లు అక్టోబర్‌ 6, 12వ తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ముందే మ్యాచ్‌ నిర్వహిస్తే.. పాక్‌ జట్టుకు వెంటనే సిద్ధమయ్యేందుకు తగిన సమయం దొరకదు.

అక్టోబర్‌ 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో భాగంగా దేశంలోని 10 వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్స్‌ నవంబర్‌ 19 ఉంటుంది.

Latest News