Ipl 2024 GTVSKKR : గుజరాత్ కొంపముంచిన వరుణుడు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు, సొంత మైదానంలో వరుణదేవుడు గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై భారీ వర్షాన్ని చల్లాడు. భారీ వర్షం కారణంగా ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దయింది.

  • Publish Date - May 13, 2024 / 11:51 PM IST

అహ్మదాబాద్​లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొతేరా స్టేడియంను మోతెక్కిచింది. ఐపిఎల్​ 2024లో భాగంగా జరగాల్సిన గుజరాత్​–కోల్​కతా (GT vs KKR) మ్యాచ్​ దీంతో రద్దయింది. ఒక్క బాల్​ కూడా పడకుండా ఎడతెరపి లేని వాన ఆటను గంగలో కలిపేసింది. దీనివల్ల రెండు కీలకమైన విషయాలు కూడా ఆటోమాటిక్​గా జరిగిపోయాయి. ఒకటి గుజరాత్​ టైటాన్స్​ ఇంటిముఖం పట్టడం(GT out of Playoffs), రెండోది కోల్​కతాకు ప్లేఆఫ్స్​లో మొదటి/రెండో స్థానం (KKR confirmed Top 2 place) నిర్ధారణ జరిగిపోవడం.

వరుణుడు ఇవాళ అహ్మదాబాద్​లో బీభత్సం సృష్టించాడు. కేవలం గెలుపు మాత్రమే ప్లేఆఫ్స్​ ఆశలను సజీవంగా ఉంచే వేళ, గుజరాత్​ టైటాన్స్​ ఆశలు తుపాన్​లో కొట్టుకుపోయాయి. కనీసం టాస్​ కూడా వేయడం వీలు కానంతగా గాలీవానలు స్టేడియంను ఊపేసాయి. బ్యానర్లు చిరిగిపోవడం, ఫ్లడ్​ లైట్లు పాడైపోవడం వంటివి కూడా జరిగాయి. నిజానికి గుజరాత్​ మిగిలిన రెండు మ్యాచ్​లలో భారీ విజయాలు (వారి నెట్​ రన్​రేట్​ –1.063) సాధిస్తే తప్ప ప్లేఆఫ్స్​ ఆశలు గల్లంతయినట్లే. కానీ, లెక్కల్లో ఆశలుండేవి. ఆ ఆశలు కూడా ఇప్పుడు పోయిన ఒక్క పాయింట్​తో ఆవిరయ్యాయి. అదే ఒక్క పాయింట్ 18 పాయింట్లతో గొప్ప రన్​రేట్​తో ఉన్న కోల్​కతాకు టాప్​‌‌2లో బెర్త్​ కన్​ఫర్మ్​ చేసింది.

గుజరాత్​ ఐపిఎల్​ ప్రస్థానంలో ప్లేఆఫ్స్​ ఆడలేకపోవడం ఇదే మొదటిసారి. ఇక మిగిలిన నామమాత్రపు మ్యాచ్​లో హైదరాబాద్​తో మే16న తలపడనుంది. ఇక కోల్​కతా తమ మిగిలిన ఒక్క మ్యాచ్​లో రాజస్థాన్​ను ఓడిస్తే, చరిత్రలో మొదటిసారిగా మొదటిస్థానంలో ఉంటుంది. రాజస్థాన్​ తమకు ఉన్న రెండు మ్యాచ్​ల(ఒకటి కోలకతా తోనే)లో ఓడిపోయినా కోల్​కతా ఫస్టే.

ఈ ఒక్క మ్యాచ్​ రద్దవడం నాలుగు జట్ల జాతకాలను తారుమారు చేసింది. మ్యాచ్​ ముందు వరకు ఉన్న లెక్కలన్నీ మారిపోయాయి. చెన్నై, హైదరాబాద్​, బెంగళూరు, లక్నో ఇప్పుడు సమీకరణాలలో తేడాలను విపులీకరించుకునే పనిలో పడ్డాయి. ఎవరు ఎవరితో ఓడిపోవాలి? ఎవరు ఎవరిపై గెలిస్తే మనకు లాభం? అనే లెక్కలు వారిని భయపెడుతున్నాయి.

 

Latest News