Site icon vidhaatha

PM Modi | అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని నరేంద్రమోదీ.. Video

PM Modi : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎండల భయంతో ఓటింగ్‌ ప్రారంభం కాకముందే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర లైన్‌లలో నిలబడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నగరంలోని నిషాన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం పోలింగ్‌ కేంద్రం నుంచి బయటికి వచ్చిన ప్రధాని మోదీ అందరికీ సిరాగుర్తు పెట్టిన తన వేలిని చూపించారు. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రం పరిసరాల్లోని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడిన.. ఓటర్లంతా తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి అమిత్‌ షా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని తాను గీసిన ప్రధాని మోదీ బొమ్మను ప్రదర్శించాడు. దాంతో అతని దగ్గరకు వెళ్లిన ప్రధాని నవ్వుతూ మాట్లాడారు. అతడు గీసిన చిత్రంపై తన సంతకం చేసి ఇచ్చారు. కాగా, ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నది. జూన్‌ 1న ఏడో విడత ఎన్నికలతో పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

Exit mobile version