Vaibhav Taneja |
విధాత: ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన టెస్లాలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారతీయ సంతతికి చెందిన వైభవ్ తనేజా (Vaibhav Taneja) ను నియమిస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఆ స్థానంలో ఉన్న జచారీ కిర్‌ఖోర్న్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం చీఫ్ ఎకౌంటింగ్ ఆఫీసర్ (సీఏఓ)గా ఉన్న ఆయన ఆ విధులను నిర్వర్తిస్తూనే సీఎఫ్ఓ గానూ వ్యవహరించనున్నారు.
ఎవరీ వైభవ్ తనేజా
వైభవ్ తనేజా దిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం 1996లో ప్రైస్ వాటర్ హౌస్ లో చేరి తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ సంస్థకు అమెరికా శాఖకు వెళ్లి 2016 వరకు అక్కడే ఉద్యోగంలో ఉన్నారు.
2018లో టెస్లా (Tesla) లో కార్పొరేట్ కంట్రోలర్‌గా చేరి.. అక్కడ ఉత్తమ ప్రతిభ చూపడంతో 2019లో సీఏఓగా 2021లో టెస్లా ఇండియన్ మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఎదిగారు.
సోలార్ సిటీ అనే ఒక సంస్థను టెస్లా చేజిక్కించు కోవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించారని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. ఫైనాన్స్, ఎకౌంటింగ్ విభాగాలపై ఆయనకున్న పట్టుకు ఆ డీల్ ఒక మచ్చుతునక అని అభివర్ణించింది. టెలికమ్యునికేషన్, ఫినాన్స్, టెక్నాల జీ, రిటైల్ సెక్టార్లలో ఆయనకు మొత్తం 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.
అయితే సీఎఫ్ఓ పదవికి రాజీనామా చేసిన జచారీ కిర్‌ఖోర్న్ తన నిర్ణయానికి కారణాన్ని వెల్లడించలేదు.
’13 ఏళ్లుగా మేము చేసిన పనులకు, సాధించిన విజయాలకు సంతోషంగా ఉన్నా. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తన లింక్డిన్‌పోస్టులో ఆయన రాసుకొచ్చారు.
‘జచ్ కిర్‌ఖోర్న్‌కు నా ధన్యవాదాలు. ఎన్నో సవాళ్లతో కూడుకున్న 13 ఏళ్లను ఆయన ఫలప్రదంగా ముగించారు. అతడి కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నా’ అని మస్క్ ట్వీట్ చేశారు. పైకి ఎక్కువగా మాట్లాడే మస్క్, నెమ్మదస్తుడైన జచారీల భాగస్వామ్యం సంస్థను విజయపథంలో నడిపిందని టెస్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. మస్క్ వ్యవహారశైలి సరిపడకే జచారీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.