గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య..కలకలం రేపుతున్న వరుస ఆత్మ హత్యలు

ఇటీవ‌లే భువ‌న‌గిరి సాంఘీక వ‌స‌తి గృహంలో ఇద్ద‌రు విద్యార్థినిల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే మ‌రో దారుణం చోటు చేసుకుంది

  • Publish Date - February 11, 2024 / 04:18 AM IST

విధాత‌: ఇటీవ‌లే భువ‌న‌గిరి సాంఘీక వ‌స‌తి గృహంలో ఇద్ద‌రు విద్యార్థినిల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే మ‌రో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి శ‌నివారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన క‌ల‌క‌లం రేపుతున్న‌ది.



 


శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫేర్‌ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి, పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది. ఆ త‌రువాత ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స‌మాచారం. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సిబ్బంది త‌ల్లిదండ్రుల‌కు సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు అక్క‌డికి చేరుకున్నారు. వారు అక్క‌డికి చేరుకునే లోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.