విధాత : తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విబేధాల నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం రోజంతా ఢిల్లీలో కసరత్తు కొనసాగించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పోటీగా సీఎం పదవి రేసులో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. వారితో పాటు పార్టీ పరిశీలకులు డికే శివకుమార్, ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రేలను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ ఆ నలుగురి అభిప్రాయలు తీసుకుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ, కే.సి.వేణుగోపాల్‌లు వారితో వేర్వేరుగా భేటీ నిర్వహించి వారి అభిప్రాయలు తీసుకున్నారు. ఖర్గేకు డీకే, థాక్రేలు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా అందించారు. సీఎం అభ్యర్థి పై సాయంత్రం ప్రకటన చేస్తామని ఖర్గే చెప్పడంతో వారంతా తిరిగి హైద్రాబాద్ బయలుదేరారు.
ఇదే సమయంలో సోమవారం సీఎల్పీ సమావేశానికి హైద్రాబాద్ ఎల్లా హోటల్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పటి నుంచి కూడా సీఎం అభ్యర్థిత్వంపై హైకమాండ్ ప్రకటన కోసం ఎల్లా హోటల్‌లోనే ఉండిపోయారు. వారందరికి పార్టీ వేర్వేరుగా రూమ్‌లు బుక్ చేసి హోటల్‌లోనే ఉంచింది.
ఈ సందర్భంగా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు. అలాగే సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు కూడా హోటల్‌కు వచ్చి రేవంత్‌ను కలిశారు. అందరూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన కోసం సాయత్రం వరకు ఎదురుచూస్తు కబుర్లలో నిమగ్నమయ్యారు.