రేవంత్ రెడ్డి ఏమైనా చెడ్డి గ్యాంగ్ సభ్యుడా?: హరీష్ రావు

  • Publish Date - April 12, 2024 / 10:36 PM IST

*వారు ప్రజలను ఉద్ధరించింది
లేదు.. అన్నీ ఉద్దెర మాటలే…

*కాంగ్రెస్ బిజెపి మధ్య
చీకటి ఒప్పందం

*అందుకే బలహీనమైన
అభ్యర్థులను ఎంపీ ఎన్నికల్లో
బరిలోకి దింపారు

*కరీంనగర్ రోడ్డు షో లో
మాజీ మంత్రి తన్నీరు హరీష్

విధాత బ్యూరో, కరీంనగర్: “రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరితే, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చెడ్డీ ఊడ కొడతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనేమైనా చెడ్డి గ్యాంగ్ సభ్యుడా? అందులో చేరిపోయారా? ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా”అంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కరీంనగర్ లో ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదు?
కాంగ్రెస్, బిజెపిల మధ్య చీకటి ఒప్పందం ఉంది.. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు అభ్యర్థి ఎంపిక విషయంలో నాన్చుతూ వస్తున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను దెబ్బతీయటానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ క్రమంలోనే బలహీనమైన అభ్యర్థులను లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీకి నిలిపిందని చెప్పారు. రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వి అన్ని ఉద్దెర మాటలేఅని, ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వాస్తవాలు గుర్తించాలన్నారు.
తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతల గంభీరమైన ఉపన్యాసాలు ఎక్కడ పోయాయని ఆయన ప్రశ్నించారు.
“మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 లబ్ధి పొందుతున్న మహిళలు, 4000 రూపాయల పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వితంతువులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, అవి రాని వాళ్లు కారు గుర్తుకు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాలుగు నెలల క్రితం బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని సామాజిక వర్గాలకు అన్యాయమే జరిగిందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ప్రజలు మరో ఐదేళ్లు అనుభవించాల్సి వస్తుందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా చూస్తే, 6 గ్యారంటీలు, 13 హామీలపై తాము శాసనసభ వేదికగా వారిని నిలదీసే అవకాశం కలుగుతుందన్నారు. జై తెలంగాణ అంటే తుపాకీతో కాల్చేస్తానన్న వ్యక్తి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని, సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తే ఆయనను సమర్ధించాలా? వద్దా అన్నది ఉద్యమ గడ్డ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ నేతలు పాలనను గాలికి వదిలేసారని, కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు.. రిజర్వాయర్లు ఎండిపోయాయి.. కరీంనగర్ లాంటి చోట రోజుకు ఒకసారి ఇచ్చే తాగునీరు, రోజు విడిచి రోజు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాగే జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.

కరీంనగర్ బి ఆర్ ఎస్ పార్టీకి పుట్టినిల్లు లాంటిదని, కెసిఆర్ కు ఈ ప్రాంతంపై ఎనలేని ప్రేమ ఉందని, ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత ఇక్కడి ప్రజలకే దక్కుతుందన్నారు. 2019 ఎన్నికల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి బండి సంజయ్ ఎంపీగా గెలిచారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఏనాడైనా కరీంనగర్ సమస్యలు పార్లమెంటులో ప్రశ్నించారా అని నిలదీశారు. పదేళ్ల బిజెపి పాలనలో తెలంగాణకు ఒక్క మంచి పని జరగలేదన్నారు. బిజెపి దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలిని పెంచిందన్నారు. ఓవైపు నిత్యవసర వస్తువుల ధరలు, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు మంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందన్నారు. దేశవ్యాప్తంగా 175 వైద్య కళాశాలలు ఏర్పాటుచేసిన బిజెపి అందులో ఒకటి తెలంగాణకు కేటాయించలేదన్నారు.

పదేళ్లలో చేసిన పథకాలు ఏమీ లేకపోగా, ప్రస్తుత ఎన్నికల్లో చిత్రపటాలు, క్యాలెండర్లు మాత్రం పంచుతున్నారని ఎద్దేవా చేశారు.
చిత్రపటాలు, క్యాలెండర్లు పేదల కడుపు నింపుతాయా అని ఆయన ప్రశ్నించారు. సాధ్యం కానీ స్మార్ట్ సిటీ అవకాశాన్ని వినోద్ కుమార్ సాధించారు. ఫలితంగా కరీంనగర్ అభివృద్ధికి 1,000 కోట్ల నిధులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రోడ్ షో లో బి ఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ
బండి సంజయ్ ఎంపీ పదవిని పునరావాస కేంద్రంగా మార్చాలని ఆరోపించారు. ఆ పదవిపై ఆయనకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.
ఆయనకు కావాల్సింది రాజ్యాధికారం అందుకే ఎంపీగా ఉంటూనే శాసనసభకు పోటీ చేశారని చెప్పారు.

లోక సభ సభ్యుడిగా జాతీయ రహదారుల అభివృద్ధికి, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేసింది తానే అన్నారు. కరీంనగర్ పట్టణాన్ని విద్యా కేంద్రంగా మార్చాలన్న తపనతో పని చేశానని, ఇక్కడ ఐఐటి ఏర్పాటు కోసం కేంద్రంతో కొట్లాడానని తెలిపారు. ఐఐటీ కోసం రేకుర్తి వద్ద 50 ఎకరాల స్థలం కూడా సమకూర్చి పెట్టామని చెప్పారు. కరీంనగర్ కేంద్రంగా అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా సంజయ్ ఒక బడి కానీ, గుడి కానీ తెలేదన్నారు.

కరీంనగర్లో 100 కోట్ల విలువచేసే పది ఎకరాల స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి, ఇక్కడ 50 కోట్ల ఖర్చుతో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. మానేరు ఒడ్డున ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి అంకురార్పణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్ షో కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News