విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తోందన్న ప్రచారం జోరందుకుంది. పదేళ్ల గులాబీ పాలనపై జనంలో వ్యతిరేకత పెల్లుబుకుతోందన్న చర్చ తెరపైన నడుస్తోంది. బీఆరెస్ కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల అహంకారమే ఆపార్టీ కొంపముంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల బాధలను పట్టించుకోని నేతలను ఓటు ద్వారా ఇంటికి పంపేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమవుతున్నారు.
మళ్ళీ గెలిపిస్తే బతుకులు బాగుచేస్తామని చెబుతున్న బీఆర్ఎస్ నేతల మాటలను జనం నమ్మడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. గద్దెనెక్కిస్తే ప్రజలపైనే స్వారీ చేశారని అధికార పక్షంపై విమర్శలు సంధిస్తున్నారు. ఇస్టానుసారంగా పాలన సాగించి, సొంత ఎజెండాతో ముందుకుసాగి నమ్ముకున్న ప్రజలు, నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపిస్తున్నారు. అదే కసి, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని అహంకార నేతల భరతం పట్టేందుకు పాలమూరు ప్రజలు సంసిద్ధులయ్యారని, అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆరెస్ కు ఎదురుగాలి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు, మూడు స్థానాలు మినహా మిగతాచోట్ల బీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీఆరెస్ పై వ్యతిరేకత లేకున్నా, సిటింగ్ ఎమ్మెల్యేల అహంకారంతో ప్రజలు విసిగివేసారి పోవడంతో, వారికి గుణపాఠం చెప్పాలని జనం నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అందలం ఎక్కించిన పాలమూరు జిల్లా ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో వ్యతిరేకతతో ఉన్నారు.
ఈ దెబ్బతో బీఆర్ఎస్ అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లాలని ప్రజలు భావిస్తున్నారు. కొందరి ఎమ్మెల్యేల వల్ల ఎంతోమంది ఇబ్బoదులకు గురయ్యామనే భావనలో వారికి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే విజయం ముంగిట ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లా మణిహారంగా మారే అవకాశం ఉంది.
టీపీసీసీ అధ్యక్షుడి సొంత గడ్డ..
ఉమ్మడి పాలమూరు జిల్లా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా. దీంతోనే కాంగ్రెస్ పార్టీ గాలి తుఫాన్ గా మారిందని ఆపార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 14 స్థానాల్లో రెండంకెల స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాలో ప్రచారం చేసినా, ఆ పార్టీ అభ్యర్థులకు పెద్దగా ప్రజల మద్దతు కలిసిరాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. దేవరకద్ర, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ లో మాత్రం కేసీఆర్ కు ప్రజల నుంచి ఘన స్వాగతం రాగా, ఆ పార్టీ శ్రేణులు గెలుపు ధీమాలో ఉన్నారు. కేసీఆర్ ప్రసంగం లో పస తప్పిందనే అభిప్రాయం ఇక్కడి నేతల్లో ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ప్రతి ఒక్కరి నోటా కాంగ్రెస్ మాట వినిపిస్తోంది.
బీఆర్ఎస్ పాలనలో వెనుకబడేసిన ఈ పాలమూరు జిల్లాను రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలుపుతారనే ఆశతో ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు.. ఈ జిల్లా ప్రజలు నీరు పోసి పెంచిన మొక్కను నేను… ఇప్పుడు మానులా మారాను.. టీపీసీసీ స్థాయికి ఏదిగానంటే పాలమూరు ప్రజల చలవే.
మీరు పెంచిన మాను తెలంగాణ రాష్ట్రానికి నీడనిద్దామంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు బీఆర్ఎస్ అధినేతలు భుజాన గొడ్డళ్ళు వేసుకుని నరకడానికి వస్తున్నారు’ అంటూనే పాలమూరు ప్రజల పౌరుషం చూపి ఈ కల్వకుంట్ల దొంగలను వెయ్యి అడుగుల గోతి తవ్వి పాతిపెట్టాలనే రేవంత్ మాటలు పాలమూరు ప్రజల్లో ఉద్విగ్నాన్ని నింపాయని ఆపార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో కాంగ్రెస్ గాలికి ఊతమిచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభావం జిల్లా ప్రజలపై అభిమానం పెంచే విధంగా ఉండడం కూడా ఇక్కడ కాంగ్రెస్ కు బలం పెరిగింది.
ఇంతే ధీటుగా ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ జిల్లాలో పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఆమె పర్యటన కాంగ్రెస్ కు ప్లస్ అయిందని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 14 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆయన పప్రచారంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్లు అయింది. ప్రస్తుతం పరిస్థితి బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ గాలి ఉప్పెనలా మారిందని, బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.