Xi Jinping Visits Russia । చైనా వేస్తున్న ఒక్కో అడుగు అమెరికా గుండెల్లో గుబులు రేపుతున్నది. ఇటీవలే చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య శాంతి ఒప్పందం కుదరడం అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది. అమెరికా, యూరప్ దేశాలు కంగుతిన్నాయి. చైనా అధినేత జిన్‌పింగ్ ఇక ఇప్పుడు రష్యా సందర్శించడంతో పాశ్చాత్య దేశాలు తలబాదుకుంటున్నాయి.
విధాత: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి చైనా 12 సూత్రాల పథకాన్ని(China’s 12-point peace proposal) ప్రతిపాదించింది. ఈ పథకం నలుగురూ నచ్చే విధంగా ఉంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తంటాలు పడుతున్నాయి. యుద్ధం ఏ దేశానికైనా నష్టమే. కానీ యుద్ధ విరమణ ఇరుదేశాల నాయకులకు గౌరవ ప్రదంగా ఉండాలి.
నాటో (NATO) దేశాలు ఒక వైపు నిలిచాయి. కనుక మధ్యవర్తిత్వం వహించలేవు. ఇటు రష్యా స్వయంగా యుద్ధంలో తలమునకలై ఉన్నది. ఈ స్థితిలో చైనా సూచించిన పథకం, ఇరు వర్గాలకు లోపాయికారిగా చెబుతున్న హితవు ప్రాధాన్యం సంతరించుకున్నది.
అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వదులుకోవాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి. శాంతి చర్చలు ప్రారంభించాలి. మానవతా సంక్షోభాన్ని నివారించాలి. యుద్ధ ఖైదీలకు రక్షణ ఇవ్వాలి. ఆహార ధాన్యాల ఎగుమతులు సాగాలి. అణు కేంద్రాలకు భద్రత. ఏకపక్ష ఆంక్షలు ఉండకూడదు. వాణిజ్య ఆంక్షలు ఉండకుండా సప్లయి చైన్స్ నిరాటంకంగా సాగాలి. యుద్ధానంతర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలి.
ఇవీ చైనా ప్రతిపాదనలు. ఈ ప్రతిపాదనలు నాటో దేశాల వ్యాపారులు కూడా ఎగిరి గంతేసే విధంగా ఉన్నాయి. దీంతో చైనా పెద్దరికం నానాటికి పెరిగిపోతున్నదని నాటో నాయకులు కంగారు పడే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే సౌదీ- ఇరాన్ ఒప్పందం (Saudi Iran Treaty)కుదిరించిన చైనా ప్రతిష్ఠ ఆకాశాన్నంటింది. ఇప్పుడు చైనా (China) అతి చాకచక్యంగా పావులు కదుపుతూ రష్యాను వెనకేసుకొస్తూనే, ఉక్రెయిన్‌ను గట్టెక్కించే పనిలో ఉన్నది.
President Vladimir Putin welcomed his Chinese counterpart Xi Jinping to the Kremlin Tuesday during the second day of his visit to Moscow.
Xi hailed close ties with Russia and offered closer cooperation on issues ranging from trade to technology https://t.co/LvKtmVFXKT pic.twitter.com/tmYPjx0cQH
— Bloomberg (@business) March 21, 2023
1979 (ఇరాన్ విప్లవం వచ్చింది) నుంచి ఇరాన్, సౌదీ అరేబియా తన్నుకు చస్తున్నాయి. 1976 లో రెండు దేశాల మధ్య సాధారణ దౌత్య సంబంధాలు కూడా కటీఫ్ అయ్యాయి. ఇరాన్‌ను ఇబ్బంది పెట్టడానికి అమెరికానే సౌదీ అరేబియాను పావులా వాడుకుంటున్నదనే అభిప్రాయం ఉన్నది. దీంతో ఇరాన్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా తీవ్రవాద వర్గాలను పోషించింది. లెబనాన్, ఇరాక్, లిబియా, యెమెన్ మొదలైన అరబ్బు దేశాలలో (Arab Countries) రెండు దేశాల మిలిటెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. సౌదీ అరేబియా ఇటీవలి హౌతీ తిరుగుబాటుదారుల దెబ్బకు తల్లడిల్లి పోతున్నది. మరోవైపు ఇరాన్‌పై ఆంక్షలు విధించి అన్ని దేశాలు ఈ ఆంక్షలను పాటించాలని ఒత్తిడి తెస్తున్నది.
ఈ నేపథ్యంలో చైనా మధ్యవర్తిత్వంతో పరమ శత్రువులైన ఇరాన్- సౌదీ అరేబియా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒప్పందం వల్ల అరబ్బు దేశాలలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడినట్టే. అమెరికా కోసం అరబ్బు దేశాలు మనలో మనం ఎందుకు తన్నుకోవాలనే ఆలోచన మొదలైంది.
ఇరాన్‌ను ఏకాకిని చేయాలని ప్రయత్నించిన అమెరికా (America) బొక్కబోర్ల పడినట్టు అయింది. సౌదీ చేజారిపోతే కీలకమైన అరబ్బు ప్రాంతమంతా తన గుప్పిటలో లేనట్టే. ఇజ్రాయిల్ తప్ప అమెరికాకు వేరే దిక్కుండదు. ఇరాన్ ఆంక్షలు నిర్వీర్యమైపోవడం, అరబ్బు ప్రాంతంలో తన ప్రాభవం పోవడం సరే, చైనా మధ్యవర్తిత్వం ఏమిటనేది అమెరికాను కుంగదీస్తున్నది.
ఇరాన్- సౌదీ ఒప్పందాన్ని భారత్ కూడా హర్షించింది. చైనా సంగతి తరువాత. ఇరాన్ ఆంక్షల వల్ల భారత్ చాలా ఇబ్బంది పడుతున్నది. చబహర్ రేవు ద్వారా మధ్య ఆసియా మొదలుకొని ఇంకా ఆవల కూడా వ్యాపార మార్గం ఏర్పాటు చేసుకోవాలనే భారత్ కలలకు అమెరికా ఆంక్షలు ఇంతకాలం గండికొట్టాయి. ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా అమెరికా ఆంక్షల మాటెత్తే పరిస్థితిలో లేదు.
ఇంతకాలం ప్రపంచాన్ని ఏలిన అమెరికాకు ఇప్పుడు బ్రిటన్‌కు పట్టిన గతి పట్టక తప్పదనే వాదనలు మొదలయ్యాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవమానాన్ని దిగమింగుకొని వాస్తవాన్ని గ్రహించి, తదనుగుణంగా అమెరికా మసులుకోక తప్పదు. ఇప్పటికే ఆసియా ఖండంలో చైనా పెద్దరికం సాగుతున్నది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ విరమణ సాధిస్తే ఇక ఆ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యం మరింత తగ్గుతుంది.
జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాలు ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా? అని చూస్తున్నాయి. రష్యాపై ఆంక్షల వల్ల తమ చెంపపై తామే కొట్టుకున్నట్టుగా ఉన్నదని జర్మనీ భావిస్తున్నది. ఇప్పటికీ పలుదేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అమెరికాతో మొహమాటానికి పోతే అసలుకే మోసం వస్తున్నదని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
ఈ దశలో అమెరికాకు భారత్‌పై ఆధారపడక తప్పదు. పరోక్షంగా తన ప్రాధాన్యం పెరిగే పరిస్థితులు వస్తే భారత్ మాత్రం ఎందుకు వదలుకొంటుంది? అమెరికా పెద్ద దేశాలలో ఒకటిగా ప్రస్తుతానికి కొనసాగుతున్నది. కానీ ప్రపంచాన్ని శాసించే ఏకైక అగ్రరాజ్యంగా విర్రవీగడం కుదరదు. దీనివల్ల ఇతర దేశాలన్నిటికీ ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా ఉంటుంది.