Site icon vidhaatha

Ponguleti | ఇలాగే ఉంటే.. పొంగులేటి శపథం నెరవేరేనా?

విధాత: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) రాజకీయ భవిత్యం, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతున్నది. జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇదొక ప్రధాన చర్చనీయంశంగా ఉన్నది.

రాజకీయాలపై కాసింత ఇంట్రెస్ట్‌ ఉన్న ఏ ఇద్దరు కలిసినా ముందుగా పొంగులేటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలువనీయను అని శపథం చేశారు కదా? దాన్ని నిలబెట్టుకునే శక్తి ఉన్నదా? అన్న చర్చ జోరుగా సాగుతున్నది.

కాంట్రాక్టర్‌గా జీవితం మొదలు..

కాంట్రాక్టర్‌గా జీవితప్రస్థానం మొదలు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట్లో వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అదే బందంతో జగన్‌ వెంట నడిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఖమ్మం జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన పొంగులేటి 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు.

అదే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మరో ౩ అసెంబ్లీ సీట్లలో తన వాళ్లను వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిపించుకున్నారు. ఇలా సొంత బలంతో తను గెలిచి, తన అభ్యర్థులను గెలిపించుకొని జిల్లాలో సత్తా చాటుకున్నారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసినప్పటికీ ఆ పార్టీలోని వర్గపోరుతో ఓటమి పాలైంది.

బీఆర్‌ఎస్‌ ప్లేస్‌ను కాంగ్రెస్‌ భర్తీ చేసింది. 2018 ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ నాయకత్వం పొంగులేటికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా దూరం పెట్టిందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో నాటుకుంది. వరుస పరిణామాలతో ఆ దూరం పెరిగింది. పొంగులేటి కూడా పార్టీకి దూరంగానే ఉన్నాడన్నఅభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమవుతున్నది.

ఆత్మీయ సమ్మేళనాలతో క్యాడర్‌కు చేరువ

చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉన్న పొంగులేటి కొద్ది రోజులుగా జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాలతో తన అనుచరులందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి దారి ఎటు అన్న చర్చ మొదలైంది. ఇది ఇలా ఉండగా రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

దీనికి పొంగులేటి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. పైగా జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కనీయనని శపథం కూడా చేశారు. పొంగులేటి ఏ ఉద్దేశంతో ఈ శపథం చేశారో కానీ జిల్లా రాజకీయాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయంపై చర్చించుకోవడం గమనార్హం.

నిజంగానే అంత శక్తి ఉన్నదా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి, తన అభ్యర్థులను గెలిపించుకునే శక్తిని కలిగి ఉన్నారా? అనే చర్చ జరుగుతున్నది. అది ఇండిపెండెంట్‌గా ఉండి అభ్యర్థులను నిలుపుతారా? లేక సొంత పార్టీ పెడతారా? ఈ రెండింటిలో ఏది జరిగినా అది సొంతగా కొన్ని ఓట్లు సాధించుకోవడంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తున్నది. అదే జరిగితే అధికార పార్టీ విజయానికి పొంగులేటి పరోక్షంగా సహకరించినట్టు అవుతుందని అంటున్నారు.

ప్రభుత్వ ఓట్లు చీలకపోతేనే శపథం నెరవేరేది

పొంగులేటి తాను చేసిన శపథాన్ని నిలబెట్టుకోవాలంటే ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. జిల్లలో అన్ని గ్రామాలు, పట్టణాలలో బూత్‌ స్థాయిలో బలమున్న కాంగ్రెస్‌ పార్టీతో పొంగులేటి కలిస్తే జిల్లాల్లో ఇంకో పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఉండదని, అన్ని సీట్లు కాంగ్రెస్‌ పార్టీకే వచ్చే వాతావరణం ఉంటుందని, ఖమ్మం పట్టణానికి చెందిన ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే బేస్‌ ఉంటుందని, బీఆర్‌ఎస్‌కు కూడా ఈ రెండు పార్టీల నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్‌తో సీపీఐ, సీపీఎం పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ జిల్లాలో విధిగా కాంగ్రెస్‌కే మళ్లే అవకాశాలున్నాయని, ఈ సమయంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉండదని ఆయన విశ్లేషించారు. బీజేపీ, లేదా ఇతర పార్టీలు వ్యక్తులకు ఓటు బ్యాంకు లేని విషయాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎటు మొగ్గు చూపుతారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తున్నది.

Exit mobile version