ఇజ్రాయెల్ – హ‌మాస్‌ల మ‌ధ్య మొద‌లైన బందీల విడుద‌ల‌

ఇజ్రాయెల్ - హ‌మాస్ సంక్షోభం (Israel-Hamas Conflict) లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది

  • Publish Date - November 25, 2023 / 08:16 AM IST

విధాత‌: ఇజ్రాయెల్ – హ‌మాస్ సంక్షోభం (Israel-Hamas Conflict) లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇరు వ‌ర్గాలు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 39 మంది పాల‌స్తీనియ‌న్ ఖైదీల‌ను హ‌మాస్‌కు అప్ప‌గించ‌గా.. హ‌మాస్ స‌భ్యులు 13 మంది బందీల‌ను ఇజ్రాయెల్‌కు అప్ప‌గించారు. ఈ 13 మందినీ వారి వారి కుటుంబాల‌కు అప్ప‌గించే ముందు వైద్య ప‌రీక్ష‌లు చేస్తామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.


కాగా నాలుగు రోజుల పాటు స్వ‌ల్ప కాల కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. అక్క‌డ‌క్క‌డా కాల్పులు, పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుద‌లైన‌ 39 మంది ఖైదీల‌కు గాజాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మందుగుండు సామ‌గ్రి కాల్పులు, సంగీత ప‌రిక‌రాల‌తో వారికి భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లికారు.


ఉగ్ర‌వాదుల వ‌ద్ద బందీలుగా ఉన్న‌వారిని వారి కుటుంబాల‌కు అప్ప‌గించ‌డం యుద్ధ ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకున్న గాజాలోని అల్ షిఫా ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ ప‌రిస్థితిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రో ఆరుగురు ఇజ్రాయెల్ వ‌ద్ద బందీలుగా ఉన్న‌ట్లు స‌మాచారం ఉంద‌ని పేర్కొంది.


ఈ వ్య‌వ‌హారంపై ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అల్ షిఫా ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ మ‌హ‌మ్మద్ అబూను ప్ర‌శ్నిస్తున్నాం. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఉన్న ఆసుప‌త్రి కిందే హ‌మాస్ నెట్వ‌ర్క్ మొత్తం ఉంది. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలియ‌కుండా ఉంటుందా? అని ఆ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శ్నించింది. ఇజ్రాయెల్‌పై అంత‌ర్జాతీయంగా ..ముఖ్యంలో అమెరికాలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.


ఇక్క‌డి వ్యాపారుల‌కు ఎంతో కీల‌క‌మైన బ్లాక్ ఫ్రైడే సేల్స్‌ను అడ్డుకోవాల‌ని పాల‌స్తీనా మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. త‌మ ప్ర‌జ‌లు అక్క‌డ క‌ష్టాలు ప‌డుతుంటే..ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ ఇక్క‌డ వ్యాపారాలు చేయ‌డం స‌రికాద‌ని వారు నినదించారు.


చికాగో, ఇలినాయిస్‌, లాస్ ఏంజెలెస్‌, కాలిఫోర్నియాల్లో ఈ నిర‌స‌న‌లు జ‌రిగాయి. అక్టోబ‌రు 7 నుంచి మొద‌లైన ఈ సంక్షోభంగా హ‌మాస్ ఉగ్ర‌వాదులు 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల‌ను బ‌లితీసుకోగా.. ఇజ్రాయెల్ ప్ర‌తిదాడుల్లో పాల‌స్తీనాకు చెందిన 14000 మంది గాజా పౌరులు మృతి చెందారు. వీరిలో 40 శాతం మంది చిన్నారులేన‌ని అక్క‌డి సిబ్బంది చెబుతున్నారు.