ISRO |
విధాత: వేదాల్లోనే ఆస్ట్రానమీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఉంటే.. ఇస్రో (ISRO) వాటిని ఎందుకు ఉపయోగించడం లేదని శాస్త్రవేత్తలు, పరిశోధకుల ఉమ్మడి వేదిక ద బ్రేక్ థ్రూ సైన్స్ సొసైటీ (BSS) ప్రశ్నించింది. ఆధునిక విజ్ఞానం అంతా వేదాల నుంచే ఉద్భవించిందన్న ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఇటీవలి వ్యాఖ్యలపై మండిపడింది. ఆయన వ్యాఖ్యలను అసత్యమైనవిగా కొట్టిపడేసింది.
భారత వేద సారమంతా అరబ్బుల వద్దకు ఆ తర్వాత యూరప్‌కు తరలిపోయిందన్న ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ… ‘600 బీసీ నుంచి 900 ఏడీ వరకూ భారత్‌లో గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగాయన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే విధంగా అంతే స్థాయిలో ఈజిప్ట్, గ్రీస్, మెసపటోమియా తదితర నాగరికతల్లోనూ అదే సమయంలో లేదా అంతకన్నా ముందే సైన్స్ అభివృద్ధి చెందింది.
అనంతరం అరబ్బులు చొరవ తీసుకుని ఆ జ్ఞానాన్ని భద్రపరిచారు. వారి ద్వారా అది యూరప్‌కు వెళ్లింది. అనంతరం గెలీలియో వల్ల ఆబ్జెక్టివ్ సైన్స్ పురుడుపోసుకుంది. ఇలా వివిధ నాగరికతల సమిష్టి కృషి వల్ల సైన్స్ దశలు దశలుగా పురోగమించింది’ అని బీఎస్ఎస్ వివరించింది.
అంతే కాకుండా శాటిలైట్లు, రాకెట్‌ల రూపకల్పనలో ఎన్ని అంశాలు వేదాల నుంచి తీసుకున్నారో ప్రకటించాలని డాక్టర్ సోమనాథ్‌కు సవాలు విసిరింది. ఈ పోకడపై గళమెత్తాలని మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక సంస్థలకు బీఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది.