మోదీతో ఇటలీ ప్ర‌ధాని సెల్ఫీ.. ఇంట‌ర్నెట్‌లో ఫుల్ వైర‌ల్‌

దేశాధినేత‌లు కూడా ఇంట‌ర్నెట్‌లో ట్రెండ్స్‌ను అనుస‌రిస్తూ.. వాటిని దృష్టిలో ఉంచుకుంటార‌ని తాజా ఘ‌ట‌న ఒకటి రుజువు చేసింది.

  • Publish Date - December 2, 2023 / 09:52 AM IST

విధాత‌: దేశాధినేత‌లు కూడా ఇంట‌ర్నెట్‌లో ట్రెండ్స్‌ను అనుస‌రిస్తూ.. వాటిని దృష్టిలో ఉంచుకుంటార‌ని తాజా ఘ‌ట‌న ఒకటి రుజువు చేసింది. భార‌త ప్ర‌ధాని మోదీ , ఇటలీ ప్ర‌ధాని జార్జియా మెలోనీల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని మీమ్ పేజీలు, ట్విట‌ర్ పేర‌డీ ఎకౌంట్‌లు కొద్ది కాలంగా ట్రెండ్ చేస్తున్నాయి. వీరి ఫొటోల‌కు ప్రేమ గీతాలు పెట్ట‌డం, మోదీజీ వాయిస్‌ను ఏఐ ద్వారా పాట‌లుగా మార్చి వాటికి వీరిద్ద‌రి ఫొటోల‌ను జ‌త చేయడం చేస్తున్నాయి.


వీటికి మెలోనీ (Meloni) లోని మెలోని .. మోదీ(Modi) లోంచి డీని తీసుకుని మెలోడీ (Melodi) అనే హ్యాష్‌ట్యాగ్‌ను బాగా ప్ర‌చారంలోకి తీసుకొచ్చాయి. వీటికి తోడు వివిధ అంత‌ర్జాతీయ సమావేశాల్లో వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌లు, హావ‌భావాలు కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేవి. తాజాగా దుబాయ్‌లో జ‌రుగుతున్న కాప్ స‌ద‌స్సులో పాల్గొనేందుకు మోదీ, మెలోనీలు సైతం అక్క‌డ‌కు చేరుకున్నారు.


ఈ క్ర‌మంలో మోదీతో సెల్ఫీ తీసుకున్న మెలోనీ.. ఆ ఫొటోను ఇన్‌స్టా, ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌నూ పెట్టారు. దీంతో ఇంట‌ర్నెట్ దృష్టి ఆ పోస్టుపై ప‌డింది. దీనిని బ‌ట్టి భార‌త్‌లో మోదీపైత‌న‌పై వ‌స్తున్న మీమ్స్‌ను ఆమె ఫాలో అవుతున్నార‌ని తెలుస్తోంద‌ని చాలా మంది కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ఇది నెటిజ‌న్లు, మీమ‌ర్ల విజ‌య‌మ‌ని మ‌రికొంద‌రు పేర్కొన్నారు.


ఇంకొంత‌మంది అడుగు ముందుకేసి 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు మెలోనీని ఎన్నిక‌ల ప్ర‌చారానికి పిల‌వాల‌ని… ఇటలీ మ‌హిళ అయిన సోనియాగాంధీని అదే దేశానికి చెందిన మెలోనీ క‌ట్ట‌డి చేస్తార‌ని చ‌మ‌త్కరించారు. దేశాధ‌నేత‌లంద‌రూ ఫొటోకు ఫోజిచ్చిన స‌మ‌యంలోనూ మోదీ, మెలోనీ న‌వ్వుకుంటూ మాట్లాడ‌టం క‌నిపించింది.