విధాత: అచ్చచ్చ నేను ఈపాలి ఎన్నికల్లో పోటీ చేయనంటే చేయను అని చెబుతున్నా మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. మరేటి సేత్తామ్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
మొన్నటి వరకూ విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ధర్మాన ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారు. తాను ఇక రిటైర్ అవుతానని అంటున్నా జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ పోటీకి రెడీ అవ్వమంటున్నారన్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ జెండాపై పోటీ చేసిన ప్రసాదరావు జగన్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ పోటీ చేసినా గెలుపునకు ఢోకా లేదు.
అయితే ఈసారి తన కొడుకు రామ్ మనోహర్ నాయుడిని పోటీలో దింపాలనేది ప్రసాదరావు ఆలోచన. ఈ క్రమంలోనే తరచుగా ఆయన పాల్గొనే కార్యక్రమాలకు తనయుడిని తీసుకు వెళ్తున్నారు. అయితే.. దీనికి సీఎం జగన్ అడ్డు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి మనం జాగ్రత్తగా ఉంటే.. తర్వాత ఇక ఎదురే లేదని ఆయన తరచుగా చెబుతున్నారు. వారసులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నవారికి ముఖ్యంగా ఇదే చెబుతున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పెద్దగా మార్పులు ఉండబోవని కూడా సీఎం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని బహుశ మనసులో పెట్టుకునే.. ప్రసాదరావు ఇలా వ్యాఖ్యానించి ఉంటారనేది పరిశీలకుల మాట.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని.. అయితే.. సీఎం జగన్ మాత్రం ఈ సారికి మీరే పోటీ చేయాలని చెబుతున్నారని ప్రసాదరావు తెలిపారు.
అయితే.. ఈ క్రమంలో ఆయన వారసుడి విషయాన్ని పక్కన పెట్టి.. వచ్చే తరం నేతలకు అవకాశం ఇవ్వాలనేదే తన వ్యూహమని భవిష్యత్ రాజకీయ నేతలను తయారు చేయాలనేదే తన లక్ష్యమని అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇదే తరహాలో బొత్స సత్యనారాయణ సైతం తన కుమారుడు సందీప్ ను చీపురుపల్లి నుంచి పోటీలో ఉంచాలని భావించినా జగన్ కాదన్నారని అంటున్నారు.