Jagan Jai to Visakhapatnam.. Entrepreneurs too
విధాత: పెట్టుబడుల సదస్సు ముగిసింది.. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. ఎన్ని వాస్తవరూపం దాలుస్తాయ్ అనేది పక్కనబెడితే ఒక విషయం మీద అయితే స్పష్టత వచ్చింది. రాష్ట్ర రాజధాని విశాఖ అనే పాయింట్ అటు పారిశ్రామిక వేత్తల్లో ఎస్టాబ్లిష్ అయింది. కేంద్రమంత్రులు.. రాష్ట్ర మంత్రులతో పాటు జగన్ సైతం జై విశాఖ.. జై రాజధాని అనేశారు.
ఈ సందర్భంగా సదస్సులో జగన్ మాట్లాడుతూ విశాఖకు తాను త్వరలో మకాం మారుస్తాను అని క్లారిటీ ఇచ్చేశారు. జగన్ ఈ ప్రకటన ఇస్తున్నపుడు కేంద్ర మంత్రులు కూడా సభలో ఉండడం విశేషం. సమ్మిట్ లో మాట్లాడిన ప్రతీ కేంద్ర మంత్రి విశాఖను కొనియాడారు.
విశాఖ ప్రాముఖ్యతను కొనియాడిని కేంద్ర మంత్రులు
కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అయితే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఆరు లైన్ల రోడ్లను ఆరు వేల కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఏపీ మొత్తానికి మౌలిక సదుపాయాలకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన నితిన్ గడ్కరీ అందులో మూడవ వంతు విశాఖకే ఇచ్చారు. రెండవ రోజు సదస్సులో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే విశాఖ రాజధాని నగరం అంటూ స్టేజి మీదనే చెప్పారు. మరో కేంద్ర మంత్రి శర్భానంద్ సోనోవాల్ అయితే విశాఖ ఏపీకి వరం అని చెప్పారు. ఏపీ మొత్తానికి ఒక్క విశాఖ సిటీ ఉందని ఇంతటి అద్భుతమైన నగరం కలిగి ఉండడం ఏపీకి గర్వకారణం అని అన్నారు.
రాజధాని విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే..
విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించడం ద్వారా జగన్ ముందుగా తెర తీస్తే ఆ తరువాత అంతా విశాఖ ప్రాముఖ్యతను కొనియాడుతూ వచ్చారు. రోడ్లూ.. పోర్టులు.. విమానాశ్రయం ఇవన్నీ ఉన్న విశాఖ రాజధాని అయితే తమ ఉత్పత్తుల ఎగుమతులు.. రాకపోకలు.. కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని వ్యాపారవేత్తలూ భావిస్తున్నారు. మొత్తానికి విశాఖను ఈ సదస్సు ద్వారా అందరి చేతా ఓటు వేయించడం ద్వారా జగన్ సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.