Japan
జపాన్: జిహ్వకో బుద్ధి పుర్రెకో రుచి అని ఊరికే అనలేదు. జపాన్‌లోని ఒక వ్యక్తి చేసిన పనికి ఆ మాట నిజమే అనిపిస్తోంది. కుక్కలా మారిపోయేందుకు ప్రత్యేక సూట్‌ను తయారు చేయించుకుని… అది వేసుకుని నగర వీధుల్లో చక్కర్లు కొట్టాడు. టీవీ ప్రకటనలకు కాస్ట్యూమ్స్ తయారుచేసే జెప్పెట్ అనే సంస్థ ఈ డాగ్ సూట్‌ను తయారు చేసింది. ఇందుకోసం వీరు సుమారు 40 రోజులు తీసుకోగా.. రూ.11.65 లక్షలు ఖర్చయింది.
ఈ డాగ్ సూట్ వేసుకుని వీధుల్లో నడిచిన వీడియోను సదరు వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. దాని పేరు ‘ఐ వాంట్ టు బి యానిమల్’ అనే ఈ ఛానల్‌కు 31 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉండగా ఈ వీడియోకు 10 లక్షల వ్యూస్ రావడం విశేషం. ‘నేను కుక్కగా మారాను. నా పేరు టోకో. జంతువుగా మారాలనే నా చిన్ననాటి ఆశ ఇప్పటికి తీరింది అని వీడియో మొదలు పెట్టే ముందు వినిపించింది.
వీధుల్లో ఈ కాస్ట్యూమ్ కుక్క నిజమైన కుక్కలాగే దొర్లుతూ.. ఇతర కుక్కల దగ్గరకెళ్లి వాసన చూస్తూ ముందుకెళ్లడం కనిపించింది. అయితే ఆ కుక్కలా మారిన వ్యక్తి ఎవరనేది తెలియలేదు. ‘కుక్కలా మారాలన్న ఆలోచన కాస్త విచిత్రమైంది. నాతో ఉన్న వాళ్లకు అది కాస్త జుగుప్స కలిగించేదే. అందుకే నేనెవరనేది చెప్పాలనుకోవట్లేదు’ అని వ్యాఖ్యానించాడు. అయితే అతడు శాశ్వతంగా ఇలా కుక్కలానే ఉండిపోతాడా.. సరదా కోసం చేశాడా అనేదానిపై స్పష్టత లేదు.