షార్​లో కలకలం: 24 గంటల వ్యవధిలో జవాన్‌, SI ఆత్మహత్య

విధాత: ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో 24గంటల్లో ఇద్దరు పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టించింది. ఒకరు ఉరేసుకొని చనిపోగా, మరొకరు తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడు. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెట్టుకు వేలాడుతూ కానిస్టేబుల్.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 29 ఏండ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవలే నెల […]

  • Publish Date - January 17, 2023 / 11:57 AM IST

విధాత: ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో 24గంటల్లో ఇద్దరు పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టించింది. ఒకరు ఉరేసుకొని చనిపోగా, మరొకరు తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడు. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చెట్టుకు వేలాడుతూ కానిస్టేబుల్..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 29 ఏండ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవలే నెల రోజుల పాటు సొంతూరుకు సెలవుపై వెళ్లి వచ్చాడు. షార్‌లో పీసీఎంసీ రాడార్‌-1లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్‌కు హాజరయ్యాడు.

రాత్రి ఏడున్నర ప్రాంతంలో కంట్రోల్‌ రూముతో మాట్లాడి అంతా సాధాణమేనని సమాచారమిచ్చాడు. కానీ మరో గంట తర్వాత అత్యవసర భద్రతా దళం విభాగం వారు పెట్రోలింగ్‌ చేసే సమయంలో చెట్టుకు వేలాడుతూ ఓ మృతదేహం కనిపించింది. తీరా చూస్తే… అది తమ కానిస్టేబుల్‌ చింతమ‌ణిదేనని గుర్తించారు.

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని..

కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకొని 24గంటలు గడువక ముందే.. మరో విషాద ఘటన షార్ లో చోటు చేసుకున్నది. సోమవారం రాత్రి షార్‌ ఒకటో గేటు వద్ద సీ షిఫ్ట్‌లో విధుల్లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌ సింగ్‌ తన వద్ద ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడు.

తుపాకీ శబ్ధం విని సహచర‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొనే సరికి 30 ఏండ్ల వికాస్‌ సింగ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలున్నారు. 24గంటల వ్యవధిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ఆత్మహత్య చేసుకోవటం షార్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఒక్క రోజు సమయంలోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుటుంబ సమస్యలతోనే చనిపోయారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.