మమ్మీ.. పాపా.. నేను చనిపోతున్నా.. జేఈఈ చదవలేను..

రాజస్థాన్‌లోని కోటాలో మరో స్టూడెంట్‌ ఆత్మహత్య సంచలనం రేపింది. అమ్మా.. నాన్నా.. నేను జేఈఈ చదవలేను.. అందుకే చనిపోతున్నాను.. నాకు మరో మార్గం లేదు..

  • Publish Date - January 29, 2024 / 10:18 AM IST

  • రాజస్థాన్‌లోని కోటాలో మరో ఆత్మహత్య
  • తనకు మరో మార్గం లేదని సూసైడ్‌ లెటర్‌

రాజస్థాన్‌లోని కోటాలో మరో స్టూడెంట్‌ ఆత్మహత్య సంచలనం రేపింది. అమ్మా.. నాన్నా.. నేను జేఈఈ చదవలేను.. అందుకే చనిపోతున్నాను.. నాకు మరో మార్గం లేదు.. అని కోటాలోని బోర్ఖేదా ఏరియాకు చెందిన నిహారికాసింగ్‌ అనే విద్యార్థిని తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య. పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో ఈ విషాద ఘటన మరో మారు చాటి చెబుతున్నది. కోటాలోని బోర్ఖేడాకు చెందిన నిహారికాసింగ్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)కి ప్రిపేర్‌ అవుతున్నది. ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నది. ఘటనాస్థలం నుంచి పోలీసులు సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ.. పాపా.. నేను జేఈఈ చదవలేను. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను లూజర్‌. నేను వరస్ట్‌ డాటర్‌. సారీ మమ్మీ, పాపా నాకు వేరే మార్గం లేదు’ అని సూసైడ్‌ లెటర్‌లో ఉన్నది.

కేంద్ర విద్యాశాఖ కింద పనిచేసే ఉన్నత విద్యాశాఖ గతవారం కోచింగ్‌ సెంటర్ల నియంత్రణపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో పదహారు లేదా అంతకు లోపు విద్యార్థులను కోచింగ్‌ సెంటర్లు చేర్చుకోరాదని స్పష్టం చేసింది. సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష తర్వాతే ఎన్‌రోల్‌మెంట్‌ ఉండాలని కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

ఈ మార్గదర్శకాలను వ్యతిరేకించాలని వివిధ కోచింగ్‌ సెంటర్లు, ఇన్‌స్టిట్యూట్స్‌ సభ్యత్వం కలిగి ఉన్న కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరోవైపు తల్లిదండ్రుల్లో కొందరు ఇదేమీ ప్రతికూల నిర్ణయం కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. కాపిటేటివ్‌ ఎగ్జామినేషన్లలో టాపర్ల ఫ్యాక్టరీగా పేర్గాంచిన కోటాలో నిత్యం విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Latest News