Hyderabad | ఎల్బీనగర్‌: పెళ్లి నిరాకరించిందని.. ప్రేమోన్మాది దాడి! తమ్ముడు మృతి

Hyderabad | యువతి, ఆమె తమ్ముడిపై కత్తిపోట్లు చికిత్స పొందుతూ తమ్ముడి మృతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో యువతి పోలీసుల అదుపులో శివకుమార్‌ విధాత: హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాద దాడి చోటు చేసుకున్నది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు కత్తితో దాడి చేయగా.. యువతితో పాటు ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె తమ్ముడు చనిపోయాడు. ప్రస్తుతం ఆ యువతి దవాఖానలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఆదివారం చోటు […]

  • Publish Date - September 4, 2023 / 12:16 AM IST

Hyderabad |

  • యువతి, ఆమె తమ్ముడిపై కత్తిపోట్లు
  • చికిత్స పొందుతూ తమ్ముడి మృతి
  • చావుబతుకుల్లో ఆస్పత్రిలో యువతి
  • పోలీసుల అదుపులో శివకుమార్‌

విధాత: హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాద దాడి చోటు చేసుకున్నది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు కత్తితో దాడి చేయగా.. యువతితో పాటు ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె తమ్ముడు చనిపోయాడు. ప్రస్తుతం ఆ యువతి దవాఖానలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఆదివారం చోటు చేసుకున్నది.

ఈ దాడికి పాల్పడిన శివకుమార్‌ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ కుందుర్గుకు చెందిన అక్క, తమ్ముడు ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో ఒక రూమ్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అక్క హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతున్నది. తమ్ముడు బీటెక్‌ పూర్తి చేశాడు. వారి తల్లిదండ్రులు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడిపిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు.

అయితే శివకుమార్‌ అనే యువకుడు ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. ఇదే విషయం మాట్లాడేందుకు నేరుగా వారు ఉంటున్న ఇంటికి ఆదివారం వచ్చాడు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం జరుగుతుండగానే తమ్ముడు అక్కడికి వచ్చాడు.

ఈ సమయంలో మరింత ఆగ్రహానికి గురైన శివకుమార్‌.. ముందుగా తన వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో యువతిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. యువతి మెడ, ముఖం, చేతులపై కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన ఆమె తమ్ముడి పైనా కత్తితో విరుచుకుపడ్డాడు.

SHIVA KUMAR

కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన అక్కా తమ్ముళ్లు.. కేకలు వేస్తూ కిందికి దిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే కర్రలతో వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. గదిలో పెట్టి తలుపు గడిపెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఇద్దరినీ దవాఖానకు తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె తమ్ముడు చనిపోయాడు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Latest News