విధాత : తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆరెస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల పాల చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఆదివారం హైద్రాబాద్‌లోని ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని నడ్డా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను ఉద్ధేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల హామీలను బీఆరెస్ పార్టీ అమలు చేయడంలో విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు.
బీఆరెస్ అంటే భ్రష్టాచార రాక్షసమితి, కాంగ్రెస్ అంటే కమిషన్, క్రిమినలైజేషన్, కరప్షన్ పార్టీ అని విమర్శించారు. ఈ రెండు అవినీతి, కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించాలన్నారు. సుస్ధిర, అభివృద్ధితో కూడిన తెలంగాణ సాధనకు, సామాజిక న్యాయం సాధనకు బీసీ సీఎం కోసం తెలంగాణ ప్రజల బీజేపీని గెలిపించాలన్నారు.భారతదేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేందుకు మోడీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు