Kagaznagar Tiger Conservation: కాగజ్ నగర్ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జీవోపై ఆదివాసీలు భగ్గుమంటున్నారు. గత నెల 30న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించి జారీ చేసిన జీవో 49 ను ఉపసంహరించుకోవాలని ఆదివాసీలు శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ముందుగా కుమ్రంభీం ,అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి ,అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీల ఆందోళనకు మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న ఆదివాసీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు సాగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. అడవులను కాపాడడం, పులులను సంరక్షించడం పేరిట ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకంగా అటవీ శాఖ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రతిఘటిస్తామన్నారు. జీవో నంబర్ 49 రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
పులుల సంరక్షణకు కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్
ఇప్పటికే తెలంగాణలో పులుల కోసం కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు ఉండగా, కొత్తగా కుమ్రం భీం పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని 1,49,288.88 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కుమ్రంభీం పులుల అభయారణ్యంగా ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చి వెళుతున్న నేపథ్యంలో వీటి సంరక్షణకు ఈ చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో కొత్తగా కుమురంభీం టైగర్ రిజర్వు ఏర్పాటుతో మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా పులుల రాకపోకలకు వీలుగా పులుల కారిడార్ ను ఏర్పాటు చేసినట్లయింది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి,తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణ సరిహద్దుల్లోని కుమ్రంభీం, కవ్వాల పులుల అభయారణ్యాలకు పులులు రాకపోకలు సాగించేలా పులుల కారిడార్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా, అందేరి, ఇంద్రావతి, ఛత్తీస్‌గఢ్ టైగర్ జోన్ కారిడార్ మరింత వైశాల్యంతో విస్తరించనుంది. మూడు రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానం చేస్తూ పెద్దపులలో సంరక్షణకు కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేశారు. కుమ్రం భీం పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణకు ఆసిఫాబాద్ డీఎఫ్ఓ మెంబర్ సెక్రటరీగా 11 మంది సభ్యులతో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు మేనేజ్ మెంట్ కమిటీని రాష్ట్ర అటవీశాఖ ఏర్పాటు చేసింది.