Site icon vidhaatha

Maoists | ఆదివాసీల మెడ‌పై జీవో 49 క‌త్తి.. అమ‌లు చేస్తే మూడు జిల్లాలు గ‌ల్లంతు

Maoists | ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కుమ్రంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని గ‌తేడాది మే 5న తెచ్చిన జీవో 49ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్రతినిధి జ‌గ‌న్ పేరుతో ప్రకటన విడుద‌ల చేశారు. ఈ జీవో ఉద్దేశం జంతువుల కోసం కాదని మోదీ, అమిత్ షా మానసపుత్రులైన అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ సంస్థల కోసమనేది అందరూ గమనించాలన్నారు. వేల సంవత్సరాలుగా అడవిని, అందులోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ జీవిస్తున్న మూలవాసులను అదే అడవికి దూరం చేసి, వారి జీవనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో కుమ్రంభీం, ములుగు, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటం నుంచి క‌నుమ‌రుగైతాయ‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెల్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్ర హింసలకు గురిచేస్తూ చంపుతున్నారని, ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలలో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి భూమాతలో నమోదు చేసి, రైతు భరోసా ఇవ్వాలన్నారు. ఆదివాసీ సంఘాలతో చర్చించి వారి న్యాయ‌మైన, రాజ్యాంగబద్ధ, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.

ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులు, కేసుల బెదిరింపులతో గూడేలను ఖాళీ చేయించేందుకు య‌త్నిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్ అనసూయ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం అవమానకరమ‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ ఆదివాసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 5 వ షెడ్యూల్, 1996 లో కాంగ్రెస్ తెచ్చిన‌ పెసా చట్టం, 2006 లో తెచ్చిన ఎఫ్‌ఆర్‌ఎ , 1/70 చట్టం గురించి సీతక్క మరచిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసులూ, రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడుతున్నా… రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.

Exit mobile version