Site icon vidhaatha

Bhangaram Devi Temple | వింత ఆచారం.. అక్క‌డ అనారోగ్యానికి గురైతే దేవుళ్ల‌కు శిక్ష‌..! సాక్షులుగా కోళ్లు..!!

Bhangaram Devi Temple | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌( Chhattisgarh ).. ఈ పేరు విన‌గానే దండకార‌ణ్యం గుర్తుకు వ‌స్తుంది. తుపాకుల గ‌ర్జ‌న‌లు.. బుల్లెట్ల వ‌ర్షం గుర్తుకు వ‌స్తుంది. అంతేకాదు.. ప్ర‌జా కోర్టులు( Peoples Court ) కూడా నిర్వ‌హించి, మావోయిస్టు( Maoists )ల‌కు ప్ర‌తికూలంగా వ్య‌వ‌హ‌రించే వారిని శిక్షిస్తారు. ఇదంతా మావోయిస్టు ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న బ‌స్త‌ర్( Bastar ) ఏరియాలో త‌రుచుగా చూస్తుంటాం. ఇదే బ‌స్త‌ర్ రీజియ‌న్‌లో ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే.. మావోయిస్టులు ప్ర‌జా కోర్టు నిర్వ‌హించి ఇన్‌ఫార్మ‌ర్ల‌కు శిక్ష విధించిన‌ట్టే.. కొన్ని గిరిజ‌న తెగ‌లు( Tribals ) ప్ర‌జా కోర్టు నిర్వ‌హించి, దేవుళ్ల‌( Gods )కు శిక్ష విధిస్తార‌ట‌. మ‌రి దేవుళ్ల‌కు శిక్ష విధించేందుకు కోళ్ల‌ను( Hens ) సాక్ష్యంగా ఉంచుతార‌ట‌. ఇదంతా ఏదో వింత‌గా, ఆశ్చ‌ర్యంగా అనిపించిన‌ప్ప‌టికీ.. ఆ గిరిజ‌న తెగ‌లు ప్ర‌తి ఏడాది భాద్ర‌ప‌ద మాసంలో ఇలా ప్ర‌జా కోర్టు నిర్వ‌హించి, దేవుళ్ల‌కు శిక్ష విధిస్తున్న మాట అక్ష‌రాల స‌త్యం.

అనారోగ్యం క‌లిగినా, స‌రిగ్గా పంట‌లు పండ‌క‌పోయినా..

బ‌స్త‌ర్ రీజియ‌న్‌లోని 70 శాతం మంది గిరిజ‌నులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా గోండ్( Gond ), మ‌రియా, భాట్రా, హ‌ల్బా, దుర్వా లాంటి తెగ‌లు కీలకంగా ఉన్నాయి. ఈ తెగ‌ల‌న్నీ క‌లిసి భాద్ర‌ప‌ద మాసంలో మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల‌కు తాము ఎంతో భ‌క్తిగా ఆరాధించే భంగారం దేవి ఆల‌యం వేదిక కానుంది. ఆ ఆల‌యం వ‌ద్దే ప్ర‌జా కోర్టు నిర్వ‌హిస్తారు. ఇక ఏడాదంతా త‌మ‌కు అనారోగ్యం క‌లిగినా, స‌రిగ్గా పంట‌లు పండ‌క‌పోయినా.. వారి వారి దేవుళ్ల‌ను ప్ర‌జా కోర్టుకు తీసుకువ‌స్తారు. ఇక అక్క‌డ సాక్షిగా కోళ్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారు. ఇక వారి తెగ‌ల్లోని పెద్ద‌లు త‌మ స‌మ‌స్య‌ను చెబుతుంటే.. కోళ్లు స్పందిస్తూ ఉంటాయి. కోళ్ల స్పంద‌న‌కు అనుగుణంగా తీర్పు వెలువ‌డుతుంది. ఈ తీర్పు జీవితాంతం శిక్ష విధించే విధంగా లేదా తాత్కాలికంగా శిక్ష విధించే విధంగా ఉంటుంది. శిక్ష ఖ‌రారైన వెంట‌నే దేవుళ్ల‌ను త‌మ పెర‌ట్లోనే ఉంచుతారు. ఈ శిక్ష కాలంలో దేవుళ్లు త‌మ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటే.. మ‌ళ్లీ త‌మ ఆల‌యంలో ప్ర‌తిష్టించుకుంటారు గిరిజ‌నులు. ఇక ఈ ప్ర‌జా కోర్టులో 240 గ్రామాల‌కు చెందిన వ్య‌క్తులు పాల్గొంటారు.

అదృష్టం క‌లిసి వ‌స్తే.. దేవుళ్ల‌కు మ‌ళ్లీ స్వాగ‌తం

భంగారం ఆలయ( Bhangaram Devi Temple ) కమిటీ సభ్యుడు ఫార్సు సలాం మాట్లాడుతూ.. ‘‘తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత కలిగిన దేవుళ్లు విఫలమయ్యారని గ్రామస్తులు విశ్వసిస్తే విచారణకు ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఇది ఏడాదికి ఒకసారి మాత్ర‌మే జరుగుతుంది. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభవించ‌డం, వ్యాధులు వ్యాప్తి చెంద‌డం, పంట‌లు పండ‌క‌పోయిన‌ప్పుడు మాత్ర‌మే.. తాము నిత్యం పూజించే దేవుళ్లు విఫ‌ల‌మ‌య్యార‌ని విశ్వ‌సించి, భంగారం దేవి ఆల‌యాన్ని(న్యాయ‌స్థానం) ఆశ్ర‌యిస్తుంటారు. అప్పుడు దేవుళ్ల‌ను విచారించి అనంత‌రం శిక్ష విధిస్తారు. ఇక వ‌ర్షాలు ప‌డ‌డం, గిరిజ‌నుల‌కు అదృష్టం క‌లిసి వ‌స్తే.. దేవుళ్ల‌కు మ‌ళ్లీ స్వాగ‌తం ప‌లికి పూజ‌లు చేస్తారని ఆయ‌న పేర్కొన్నారు.

న్యాయ‌వాదులుగా గ్రామ అధినేత‌లు.. సాక్షులుగా కోళ్లు.. 

ఈ ప్ర‌జా కోర్టులో గ్రామ అధినేత‌లు న్యాయ‌వాదులుగా, కోళ్లు సాక్షులుగా వ్య‌వ‌హ‌రిస్తాయి. విచార‌ణ అనంత‌రం కోళ్ల‌ను విడిచిపెడుతారు. దేవుళ్ల త‌ర‌పున కోళ్లు సాక్షులుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. శిక్ష విధించిన దేవుళ్ల‌ను ఆల‌యం నుంచి తొల‌గించి, కొన్నిసార్లు చెట్ల కింద ఉంచుతారు. ఇక ప్ర‌తి ఏడాది ఎంత మంది దేవుళ్లు శిక్షించ‌బ‌డుతున్నార‌నే విష‌యాన్ని నోట్ చేసుకుని, ఒక డాక్యుమెంట్ త‌యారు చేస్తున్న‌ట్లు ఫార్సు స‌లాం తెలిపారు. న్యాయ‌స్థానాల్లో ఏ విధంగానైతే కేసుల వివ‌రాల‌ను న‌మోదు చేస్తారో.. అదే మాదిరిగా ఇక్క‌డ కూడా ఒక నివేదిక‌ను త‌యారు చేస్తారు.

వ‌రంగ‌ల్ నుంచి బ‌స్త‌ర్‌కు భంగారం దేవి..

భంగారం దేవి కొన్ని శ‌తాబ్దాల క్రిత‌మే.. తెలంగాణ‌( Telangana ) లోని వ‌రంగ‌ల్( Warangal ) నుంచి బ‌స్త‌ర్‌కు వ‌చ్చింద‌ని స్థానికులు న‌మ్ముతారు. ఈ ఆల‌యాన్ని 19వ శతాబ్దంలో రాజు భైరామ‌దేవ్(  King Bhairamdev ) పాల‌న‌లో నిర్మించిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. స్థానికుడు స‌ర్జూ మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ నుంచి భంగారం దేవి వ‌చ్చిన‌ప్పుడు.. తాను ఇక్క‌డ స్థిర‌ప‌డేందుకు కొంత స్థ‌లం కేటాయించాల‌ని స్థానిక రాజును అడిగారు. కేష్క‌ల్ గుట్ట‌ల వ‌ద్ద ఆమెకు కొంత స్థ‌లం ఇచ్చారు. ఆమెతో పాటు నాగ్‌పూర్ నుంచి వ‌చ్చిన డాక్ట‌ర్ ఖాన్( Doctor Khan ) కూడా అక్క‌డే ఉండిపోయాడు. డాక్ట‌ర్ ఖాన్ స్థానికుల‌కు క‌ల‌రా, త‌ట్టు వంటి రోగాల‌కు చికిత్స అందించేవారని చెబుతారు. చివ‌ర‌కు డాక్ట‌ర్ ఖాన్ కూడా ఆధ్యాత్మిక స్థితిని పొంది.. ఖాన్ దేవ‌త‌గా మారిపోతాడు. ఇప్ప‌టికీ గ్రామ‌స్తులు ఖాన్ దేవ‌త‌కు నిమ్మ‌కాయలు, గుడ్లు స‌మ‌ర్పిస్తుంటారు. భంగారం దేవి ఆల‌యంలోనే ఖాన్ దేవ‌త కూడా ఉన్న‌ట్లు స‌ర్జూ పేర్కొన్నాడు.

Exit mobile version