Kaleswaram Commission | మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నుంచి పిలుపువచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జూన్ 5వ తేదీన తమ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులో కోరారు. జూన్ 6వ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు, 9వ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కమిషన్ విచారించనున్నది. దీంతో వారు విచారణకు హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. అయితే కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అమెరికా పర్యటనకు వెళ్తున్నందున వాయిదా కోరతారా, న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారా అనేదానిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఇంతకు ముందు విద్యుత్ కొనుగోళ్లు, అవకతవకలు, అక్రమాలపై నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి జ్యూడిషియల్ కమిషన్‌ను రద్దు చేయించిన విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆయన మీడియా ముందు విచారణ అంశాలను వెల్లడించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని తన తీర్పులో వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు నియమించలేదు. పీసీ ఘోష్ ఎక్కడా తన పరిధి దాటి వ్యవహరించలేదు. వారం రోజుల క్రితం ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మే నెలాఖరు కల్లా ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుందని, కేసీఆర్, హరీశ్, ఈటలను విచారించడం లేదని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ సోమవారం కమిషన్ గడువును జూలై 2024 వరకు పొడిగిస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మరుసటి రోజే అనగా మంగళవారం కేసీఆర్‌తో పాటు హరీశ్, ఈటలను విచారణకు రావాల్సిందిగా ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగించింది. రాజకీయ నాయకులను విచారణ చేయడం లేదని లీకులు ఇచ్చి, ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారనే వితండ వాదాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎత్తుకున్నారు.
అమెరికా వెళ్లనున్న కేసీఆర్
కేసీఆర్ అమెరికాలో చదువుకుంటున్న తన మనవడు హిమాన్షు రావు వద్దకు వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం తన డిప్లొమాట్ పాస్‌పోర్టును సమర్పించి, రెగ్యలర్ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయానికి వెళ్లి వీసా దరఖాస్తుకు కావాల్సిన పత్రాలను అందచేసి వచ్చారు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అమెరికాలో ఉంటున్నారనే విషయంలో స్పష్టత రాలేదు. విచారణకు పిలిచిన తేదీల్లో అమెరికాలో ఉన్నట్లయితే, మరో తేదీని అడిగే అవకాశం ఉంటుంది. వాయిదా తేదీని తీసుకుని, కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తలుపు మరోసారి తడతారా? అని పలువురు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులపై పలుమార్లు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తరువాతే కేసీఆర్ ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తున్నది. కేసీఆర్ నిర్ణయం మేరకే హరీశ్‌రావు కూడా విచారణకు హాజరయ్యేదీ లేనిదీ స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీలో కొనసాగుతున్నారు. కమిషన్ పిలుపు ప్రకారం జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావచ్చని అనుచరులు చెబుతున్నారు. తన వద్ద సమాచారాన్ని కమిషన్‌తో ఆయన పంచుకోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఐఏఎస్‌లు, ఇంజినీర్ల విచారణ పూర్తి
కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు వంద మంది దాకా ఇంజినీరింగ్ అధికారులను దశలవారీగా విచారించింది. ఇందులో నీటి పారుదల శాఖ ఏఈ క్యాడర్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ఉన్నారు. సచివాలయం ఆర్థిక శాఖకు చెందిన అధికారులను కూడా కమిషన్ విచారించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ఎవరు ఎంపిక చేశారు? డిజైన్ ఎవరు ఖరారు చేశారు? పాత డిజైన్ ప్రకారం ఎందుకు నిర్మాణం జరగలేదు? అంచనా వ్యయం అమాంతం పెంచడానికి గల కారణాలు ఏమిటి? అనే అంశాలపై ఇంజినీర్లను విచారించింది. వారు తెలియచేసిన వివరాలను అఫిడవిట్ రూపంలో అందచేయాలని కోరగా, దాదాపు అందరూ అఫిడవిట్లను సమర్పించారు.
కర్త, కర్మ, క్రియ కేసీఆరే
కాళేశ్వరం ప్రాజెక్టులో తమ ప్రమేయం లేదని, తామంతా నిమిత్తమాత్రులం అని సీనియర్ ఐఏఎస్ అధికారులు గతేడాది జూన్, జూలై నెలలో కమిషన్ ముందు మోకరిల్లారు. సాంకేతిక అంశాలు, డబ్బుల చెల్లింపులో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలియచేశారు. అన్ని నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నారని, చివరలో ఆమోదం కోసం తమ వద్దకు వచ్చేవని వివరించారు. తనకేమీ తెలియదని, అఫ్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తే అన్నీ తెలియచేస్తానని మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పూర్తిగా సరెండర్ అయినట్లు వార్తలొస్తున్నాయి. తనకు తెలిసిన సమాచారాన్ని కమిషన్ ముందు వివరించినట్లు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. తను నీటి పారుదల శాఖ కార్యదర్శిగా కొద్ది రోజులే చేశానని, ఒక్క ఫైలు పై కూడా సంతకం చేయలేదని స్మితా సబర్వాల్ చెప్పారు. అయితే ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటి పారుదల శాఖను పర్యవేక్షించిన విషయాన్ని దాచిపెట్టారు. ఆ హోదాలో హెలికాఫ్టర్ వినియోగించి, జిల్లాల్లో పర్యటించారు. ఆమె రాక కోసం జిల్లా మంత్రులు పూల బోకేలు పట్టుకుని ప్రొటోకాల్ పాటించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆమెను అప్పటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ స్వాగతం పలకడం వారిని నవ్వులపాలు చేసింది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్ చర్చలు
సిద్ధిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి టీ.హరీశ్ రావు వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కమిషన్ విచారణ, నోటీసులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులను కూడా పిలిచినట్లు సమాచారం. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం కమిషన్ ముందు ఎలా వ్యవహరించాలి? ఎలా సమాధానం చెప్పాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది.