విధాత: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయం నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ వెల్లడిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, నీటి ప్రయోజనాలకు గండి పడుతుందన్నారు. తెలంగాణ జలదోపిడీకి ఆదిత్య నాథ్ దాస్ సూత్రధారి అని ఆరోపించారు. వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కత్తి ఆంధ్రా వాళ్లది అయితే పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డే అని హరీష్ రావు వెల్లడించారు. బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అందుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేద్దామని ప్రభుత్వానికి హరీష్ రావు పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి జల ద్రోహానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదన్నారు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేసింది. పాత డేట్లు వేసి చేసిండు ఉత్తం కుమార్ రెడ్డి లెటర్లు విడుదల చేశారని ఆరోపించారు. మేం పోరాటం చేస్తున్న సమయంలో కేంద్రం, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టింది. పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్‌కు ఉరికిండని విమర్శించారు.
