విధాత: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన నేపథ్యంలో ఆ పార్టీలో కలవరం మొదలైంది. నిన్న రాత్రి నుంచే టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఏ జరుగుతుంది.. ఏం జరగబోతుందో అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. అంతే కాదు కవిత పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంతో అటు తెలంగాణ ప్రజల్లోనూ, ఇటు మీడియాలోను తీవ్ర చర్చ జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా కవిత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ నిన్న రాత్రి రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో.. ఈ పరిణామాల మధ్య కవిత గురువారం ఉదయం తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గద్గర స్వరంతో మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో తన ఉద్వేగాన్ని కంట్రోల్ చేసేందుకు కవిత యత్నించారు. ఆరేడు నిమిషాల పాటు కొనసాగిన మీడియా సమావేశంలో నాలుగైదు సార్లు ఉద్వేగానికి గురయ్యారు.
నా మీద కావొచ్చు.. మన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద కావొచ్చు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టడమన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదంటూ కవిత గద్గర స్వరంతో మాట్లాడారు. ఇక కాదు కూడదు.. అది జేస్తం.. ఇది జేస్తం.. జైల్లో పెడుతాం అంటే పెట్టుకో. ఏమైతది. భయపడేది ఏముంది. ఏం చేస్తరు. ఎక్కువల ఎక్కువ ఉరి ఎక్కిస్తారా? ఎక్కువల ఎక్కువ అంటే జైళ్ల పెడుతరు. పెట్టుకోరాదు.. ఏమైతది అంటూ కవిత ఉద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రజలు మన వెంట ఉన్నంతకాలం ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తున్నంత కాలం ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాను అంటూ గద్గర స్వరంతో కవిత తన ప్రసంగాన్ని ముగించారు.
కవిత మీడియా సమావేశం అంతా ఓ గంభీర వాతావరణంలో కొనసాగిందని చెప్పొచ్చు. ప్రెస్‌మీట్ ప్రారంభంలో జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కవిత నినదించారు. దీంతో అక్కడున్న నాయకులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసి, కవితకు మద్దతు తెలిపారు. కవిత నివాసానికి భారీ స్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.