Site icon vidhaatha

‘కాంతార’ తెచ్చిన తంటా.. కన్నడ పరిశ్రమ నుంచి రష్మిక బ్యాన్‌?

విధాత‌: రష్మిక మందన్నా… ఈ భామ గురించి నేటి జనరేషన్‌కు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కన్నడ బ్యూటీగా రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఆమె ఒక నేషనల్ ఐకాన్‌గా, నేషనల్ క్రష్‌గా పిలవబడుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్‌లో పాపులర్ అయ్యి.. ఇప్పుడు బాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. అయితే హీరోయిన్ అయిన తర్వాత రష్మికకు గర్వం, అహంకారం ఎక్కువయ్యాయని, సొంత పరిశ్రమను కూడా ఆమె మరిచిపోయిందని.. ఈ మధ్య కాలంలో విమర్శలు వస్తున్నాయి.

కొంద‌రు క‌న్న‌డ వీరాభిమానులు ఈ విష‌యంలో పని కట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘కాంతార’ సినిమా విషయంలో రష్మిక ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇక తాజాగా కన్నడ పరిశ్రమ రష్మిక మందన్నాను బ్యాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై రష్మిక స్పందించింది.

‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు.. ఈ చిత్రం చూశాక బృందానికి నేను అభినందిస్తూ మెసేజ్ పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కూడా కెమెరా పెట్టి నేను చూపించలేను. మెసేజ్‌లను రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమైనా ఉంటే వృత్తి పరంగానే చెప్తాను.. అని ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. కన్నడ పరిశ్రమలో బ్యాన్ అంటూ ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.

కొన్ని రోజుల కిందట ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో ‘‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నాను. పేపర్లో వచ్చిన నా ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ నాకు హీరోయిన్ అవకాశం ఇచ్చింది’’ అని చెప్పారు. అయితే తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా అనే కన్నడ నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ దీనిపై కన్నడిగులు గుర్రుగా ఉన్నారు.

వాస్తవానికి రష్మిక నటించిన తొలి చిత్రం ‘కిర్రిక్ పార్టీ’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని పరంవా సంస్థ నిర్మించగా.. కాంతారా చిత్రంలో హీరోగా నటించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిషబ్ శెట్టి రష్మిక మొదటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే తనకు మొదటి అవకాశం ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల రిషబ్ శెట్టికి, రష్మికకు భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.

ఎంతోమంది ప్రముఖులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించిన తన సొంత భాషకు, తన కన్నడ పరిశ్రమకు అద్భుత గౌరవం ఇచ్చిన ‘కాంతార’ మూవీ గురించి ఆమె మాట్లాడకపోవడం పట్ల అందరూ మండిపడుతున్నారు. కృతజ్ఞతాభావం లేని ఆమెను కన్నడ పరిశ్రమ నుంచి బ్యాన్‌ చేయాలని, ఆమె నటించే ఇతర భాషల చిత్రాలను కన్నడలో విడుదల చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా.. ‘కాంతార’ సినిమా విడుదలైన రెండో రోజో.. మూడో రోజునో రష్మిక మందన్నాని.. ఆ చిత్రం చూశారా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఆ సినిమా చూడలేదని రష్మిక సమాధానం ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కన్నడ సంస్కృతిని తెలియజేసిన చిత్రాన్ని ఆమె ఇంకా చూడలేదా? అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో తన సినిమా జర్నీ గురించి వెల్లడిస్తూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును, ఆ చిత్రాన్ని తీసిన ద‌ర్శ‌కుడి పేరును ప్ర‌స్తావించ‌కుండా.. సోకాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అన్నట్టుగా రష్మిక చుల‌క‌న చేసిన‌ట్లు క‌న్నడ భాషాభిమానులు మండిప‌డుతున్నారు. ఈ విషయంతో కన్నడిగుల‌కు కోపం మరింత ఎక్కువైంది.

వీటన్నింటిపై ర‌ష్మిక మందన్నా స‌మాధానం ఇస్తూ.. వాస్తవానికి మేముండే బిజీ షెడ్యూల్లో మేము నటించే చిత్రాలని చూడటానికి సమయం ఉండదు. అయినా కూడా ‘కాంతార’ చిత్రం బాగుంది అని తెలిసి.. అందునా రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించాడు అని తెలుసుకొని సినిమా చూడాలని భావించాను. ఆ తర్వాత సినిమా చూసి యూనిట్‌కు కంగ్రాట్స్ కూడా తెలిపాను. నిజానికి ఇప్పటివరకు కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేసినట్టు సమాచారం లేదు.

కన్నడ అంటే నాకు చాలా గౌరవం. నా మాతృభాషకు నేను ఎంతో గౌరవం ఇస్తాను. పెంచి పోషించిన కన్నడ సినీ పరిశ్రమను ఎన్నడూ చుల‌క‌న చేయను అని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ‘కాంతార’ చిత్రం దేశ విదేశాలలో అద్భుత విజయం సాధిస్తుంది. అదే సమయంలో రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘పుష్ప’ రెండో భాగంలో నటిస్తోంది.

దీంతో పాటు ఆమె బాలీవుడ్‌లో ‘యానిమల్’ మూవీలో కూడా తన సత్తా చాటి బాలీవుడ్‌లో బిజీ కావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అంతా పాజిటివ్‌గా నడుస్తుంటే.. మరోవైపు ఇదొక పెద్ద ఇష్యూగా చూపిస్తూ.. చినికి చినికి గాలి వానగా మారి సునామీ అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇది చివరకు కన్నడిగుల ఆత్మగౌరవ సమస్యగా మారడం దురదృష్టకరమనే చెప్పాలి.

Exit mobile version