విధాత: గత ఏడాది కన్నడ నుంచి విడుదలైన KGF చాప్టర్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా అత్యద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసి ఉండవచ్చు. కానీ కేవలం 16 కోట్లతో రూపొంది 400 కోట్లను వసూలు చేసిన మరో కన్నడ చిత్రం కాంతారను తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. ఈ చిత్రం అద్భుతం. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించింది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భూత కోలా ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం, భూమిని కాపాడినందుకు కృతజ్ఞతగా అక్కడే ఉన్న పోలీసు అధికారులు, ఇతర గ్రామస్తులను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. తాజాగా ఇలాంటి ఘటనే కాంతార టీమ్‌కు నిజజీవితంలో కూడా ఎదురైంది.
రిషబ్ శెట్టి, సప్తమి గౌడ వంటి వారు ఇటీవల తులునాడులో పంజూర్లి ఉత్సవానికి హాజరై పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటానికి సిద్ధం కావడం, అతనిని పంజూర్లి ఆవహించడం ఆ సమయంలో అతను రిషిబ్ శెట్టిని ఆత్మీయంగా పట్టుకొని చిత్ర బృందాన్ని సైతం దగ్గరకు తీసుకొని ఆనందంతో నవ్వులు చిందించడం వంటి సన్నివేశాలతో ఈ వీడియో సాగింది.
ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ తాజాగా షేర్ చేసింది. దీనికి వారు ప్రకృతికి కట్టుబడి మనకు స్వేచ్ఛ, విజయాన్ని అందిస్తున్న దైవాన్ని ఆరాధించండి.. కాంతార బృందం నిజజీవితంలో దైవానుగ్రహాన్ని పొందింది అని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది. కాగా ఈ వీడియోలోని దృశ్యాలు సినిమా షూటింగ్ ముందా.. లేదా సినిమా విడుదలైన తర్వాత జరిగాయా అనే దానిపై స్పష్టత లేదు.