Karimnagar
- గల్ఫ్ ఏజెంట్ మోసంతో బాధితుల ఆందోళన
విధాత బ్యూరో, కరీంనగర్: గల్ఫ్ ఏజెంట్ వల్ల మోసపోయిన బాధితులు జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు. జగిత్యాలకు చెందిన రాచకొండ మహేశ్ జగిత్యాలతో పాటు, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డికి చెందిన పలువురి నుంచి గల్ఫ్ పంపిస్తానంటూ లక్ష నుంచి మూడున్నర లక్షల వరకూ ఒక్కొక్కరి నుండి వసూలు చేశాడు.
వారందరికీ నకిలీ వీసాలు అంటగట్టాడు. అనంతరం నకిలీ వీసాలతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మహేశ్‌ను నిలదీయగా, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా జగిత్యాల ధర్మపురి రోడ్డులో మహేశ్ విగ్నేశ్వర కమ్యూనికేషన్ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ పేరిట నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు.
సుమారు 180 మంది వరకూ రావడంతో.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే మహేశ్ చాలాకాలం నుంచి తప్పించుకుని తిరుగుతూ తమను ఆర్థికంగా ముంచేసాడని , ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్యాలయం ముందే బాధితులు ఆందోళనకు దిగారు. అప్పులు చేసి ఏజెంట్ చేతిలో పెడితే.. తమను నిండా ముంచడంపై బాధితులు గగ్గోలు పెట్టారు. ఏళ్ల తరబడి కన్సల్టెన్సీ నడుపుతున్న మహేశ్ సుమారు 5 కోట్ల మేర అర్జించినట్టు తెలుస్తోంది.