విధాత బ్యూరో, కరీంనగర్: విధి లిఖితాన్ని మార్చడం ఎవరి తరం కాదేమో.. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్టు.. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన ఓ మహిళ వేములవాడ (Vemulawada) ఆలయ సన్నిధిలోనే శివైక్యం చెందింది. దైవదర్శనానికి ముందే క్యూ లైన్ లలో ఆమె గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మరణించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజేశం – లక్ష్మి దంపతులు సోమవారం వేములవాడకు వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని మంగళవారం తెల్లవారుజామున దర్శనం చేసుకుందామని ఆలయానికి వచ్చే సమయంలో లక్ష్మికి ఒక్కసారిగా చాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో మరణించింది. లక్ష్మీ మృతితో రాజేశం, వారి బంధువులుశోక సముద్రంలో మునిగిపోయారు.