విధాత: తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలంటే 224 స్థానాలకు 113 సీట్లను దక్కించుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 117 స్థానాల్లో, బీజేపీ 76 స్థానాల్లో, జేడీ (ఎస్) 26, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కింగ్ మేకర్‌గా అవుతుందని భావించిన జేడీ (ఎస్) 30 లోపు స్థానాలనే దక్కించుకునే అవకాశముంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీకు గెలిచిన సీట్లలో భారీ అంతరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక పీఠం దక్కేది ఎవరికో మధ్యాహ్నానికి స్పష్టత రానుంది.
బీజేపీ అవినీతి పాల్పడిందనే ఆరోపణను ఎన్నికల వరకు సజీవంగా ఉంచడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పే సీఎం, 40 శాతం సర్కార వంటి నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ప్రచారం తొలిదశలో అభివృద్ధి, సంక్షేమం, విధానపరమైన అంశాలపైనే బీజేపీ దృష్టి పెట్టినప్పటికీ.. అవినీతి ఆరోపణల అంశంలో కాంగ్రెస్ దూకుడుని చూసి హిందూత్వ అజెండాను ప్రచారంలోకి తీసుకొచ్చింది.
జై బజ్‌రంగ్ బలీ, హిజాబ్, ద కేరళ స్టోరీ వంటి అంశాలను ప్రధాని సహా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు తమ ఉపన్యాసాలలో ప్రస్తావించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని వక్కళిగ, వీరశైవ లింగాలయతలకు ఇచ్చినప్పటికీ భాజపాకు ఫలితం దక్కనట్లు ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది.
అయితే మరోసారి కర్ణాటకను దక్కించుకోవడానికి కమలనాథులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే జేడీ (ఎస్)తో మంతనాలు మొదలుపెట్టారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జేడీఎస్, కాంగ్రెస్ ఇప్పటికే పథకాలు రూపొందించాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో పెద్ద సంఖ్యలో హోటల్ రూంలు బుక్ అయ్యయి.