Reservations |
విధాత ప్రత్యేకం: మండల్ కమిషన్ ఉద్యమాన్ని హిందుత్వ నినాదంతో ప్రక్కదోవ పట్టించి దేశంలో గణనీయంగా ఎదిగిన పార్టీ బిజెపి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ ప్రతిపాదనలనే డిమాండ్లుగా మార్చుకొని బీజేపీని దెబ్బ కొట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నదా? కర్ణాటక ఫలితాలు చూస్తే అదే కనిపిస్తున్నది.
ఎన్నికలకు ముందు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్య వర్గాలకు వాటిని పంచడం, ఒక వర్గం ఓట్లు తమకు అక్కరలేదని ప్రచారం చేయడం వంటివి బీజేపీకి బూమ్‌రాంగ్ అయ్యాయని ఫలితాలు సూచిస్తున్నాయి. ఏ వర్గాల ఓట్లు తమకు పడుతాయోనని ఆ పార్టీ పెట్టుకున్న అంచనాలన్నీ రివర్స్ అయ్యాయి.
ఈ వర్గం ఆ వర్గం అంటూ ఏదీ లేకుండా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాద్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 16న కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘జిత్నీ అబాదీ, ఉత్నా హక్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. సామాజిక-ఆర్థిక కుల గణన (2011-12)ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ రాజకీయ లబ్ధి కోసం కదిపిన రిజర్వేషన్ల అంశం ఆ పార్టీకే నష్టం చేసిందని స్పష్టమౌతున్నది.
కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు బూమరాంగ్
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాలకు కేటాయించి అక్కడి బొమ్మై ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై అన్నివర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా నేడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని గూర్చి చర్చ జరుగుతున్నది.
మొదటి నుంచీ వ్యతిరేకమే
దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియపై సంక్షేమ పథకాలపై వారి పార్టీ నాయకత్వం వివిధ సందర్భాలలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజికంగా వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్లపై, అణగారిన వర్గాలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న చేయూతలపై ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఫ్రీ బీస్ ఇవ్వకూడదని ప్రతి సందర్భంలో హెచ్చరిస్తున్నారు.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారానే సమాజంలో అంతరాలను తగ్గించగలుగుతాం. ఆర్థికంగా వెనుకబడినవారికి, వృద్ధులు, మహిళలు,వికలాంగులకు సహాయం అందించడం కూడా ఫ్రీబీగా పరిగణించడం అవివేకం. సమాజంలో వివిధ అంతరాలను తొలగించకుండా నిచ్చెన మెట్ల కులవ్యవస్థను తిరిగి పాదుకొలుపాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది.
దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రతిపక్షంలో ఉన్న యూపీఏ కూటములను పరిశీలిస్తే తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారినాయి. యూపీఏ కూటమిలో ఉన్న ఎక్కువ పార్టీలు మండల్ కమిషన్ కు మద్దతు ఇచ్చినవి. రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ, జనతాదళ్ పార్టీలకు బీసీల హక్కులు, వాటా కోసం పోరాడిన చరిత్ర ఉంది. ఆ పార్టీల ప్రభావంతో వచ్చిన వివిధ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు యూపీఏ కూటమిలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా బీసీ కుల గణన పైన చర్చ జరుగుతున్నది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ముందుకు తెచ్చింది. ఈ రిజర్వేషన్ తేనె తుట్టెను ముందుగా కలిపి ఇది మాత్రం బీజేపీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ‘జిత్ని ఆబాదీ ఉత్నా హక్’ చేసిన నినాదం మెజారిటీ బిసి వర్గాలను ఆలోచనలో పడేసింది. నిజానికి ఆ డిమాండ్ మండల్ కమిషన్ ఏర్పాటుకు ముందు నుండి ఉంది.
40 శాతం దాకా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని మండల్ కమిషన్ సూచించింది. నివేదిక అమలు సమయంలో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఓబీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది.
2011-12 నిర్వహించిన సామాజిక, ఆర్థిక కులగణనను నివేదికను విడుదల చేయాలని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకులు స్టాలిన్, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ మొదలైన నాయకులు కుల గణన జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
మన దేశంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా వెనుకబడిన వర్గాలకు 60 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రకటించినాడు. రాహుల్ గాంధీ అదే నినాదాన్ని తీసుకొని ముందుకెళ్లడం రేపటి రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. బీజేపీ హిందుత్వ వ్యతిరేక నినాదానికి విరుగుడుగా మాత్రమే విపక్షాలు ఈ నినాదాన్ని తీసుకున్నాయా, నిజాయితీగానే రాబోయే రోజులలో అమలు చేయాలనుకుంటున్నాయా? అనేది వేచి చూడాలి.
– ఎర్రోజు శ్రీనివాస్