జైపూర్‌లో కర్ణి సేన అధ్యక్షుడి హత్య

రాజస్థాన్ జైపూర్‌లో మంగళవారం శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు గురయ్యారు.

  • Publish Date - December 5, 2023 / 11:19 AM IST

విధాత : రాజస్థాన్ జైపూర్‌లో మంగళవారం శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లోకి చొరబడిన నలుగురు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. కాల్పుల ఘటనలో సుఖ్‌దేవ్‌సింగ్ గోగమేడి చనిపోగా, అనుచరుడు అజిత్ సింగ్ గాయ పడ్డాడు. సీసీ టీవి ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు రాజకీయ కారణాలు, కర్ణిసేనలో విబేధాలు కారణం కావచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ ఉమేశ్ మిశ్రా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గోగమేడి హత్యకు పాల్పడినట్లు ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతా జరిగిన హత్య కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అతనికి పోలీసులు తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతా రాష్ట్రంలో శాంతి, ప్రశాంతత నెలకొనేలా చూస్తామన్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని విడిచిపెట్టబోమని, ప్రజలు సంయమనం పాటించాలని తెలిపారు.