కేసీఆర్ కిట్టు ఒకటా.. రెండా?.. సివిల్ జడ్జి శాలినిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి!

పేదలకు వరంగా ప్రభుత్వ హాస్పిటళ్లు విధాత, వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమై, మంచి చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఛీప్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మంత్రి ఎర్రబెల్లి, దాస్యం కలిసి […]

  • Publish Date - December 16, 2022 / 12:54 PM IST
  • పేదలకు వరంగా ప్రభుత్వ హాస్పిటళ్లు

విధాత, వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ దవాఖానాలు పటిష్టమై, మంచి చికిత్స అందిస్తూ పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఛీప్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.

ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మంత్రి ఎర్రబెల్లి, దాస్యం కలిసి ఆమెను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. కేసీఆర్ కిట్ అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని అన్నారు. వ‌రంగల్ జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటళ్ల‌ను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవఖానాలలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసింద‌ని చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేటట్లు చూస్తామని తెలిపారు.

జిల్లా జడ్జిగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించింద న్నారు. కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి రూ.12 వేలు అందిస్తున్నామని దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదన్నారు.

కేసీఆర్ కిట్టు ఒకటా? రెండా?

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవఖానాలో ప్రసవించిన జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న రాచర్ల శాలినికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందించే కేసీఆర్ కిట్లు రెండు ఇచ్చారా? లేక ఒకే ‘కిట్టు’ను రెండు’సార్లు’ అందించారా? అనే ధర్మ సందేహం స‌ర్వ‌త్రా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని పర్యాయాలు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.

మంత్రులు, ప్రజాప్రతినిధుల సందర్శన, పరామర్శలు చేసే సందర్భంలో ఇలాంటివి చోటు చేసుకోవడం పరిపాటి. అధికారులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో? ఎందుకంటే రాచర్ల శాలినిని అభినందించిన సమయంలో ఇదే జరిగినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించిన బిడ్డలకు సహజంగా అందించే కేసీఆర్ కిట్టును శాలినికి సోమవారం అందించారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవించినందునకు అమెను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి. సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు.

శాలిని ప్రసవ విషయం తెలిసిన జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి, చీప్‌విప్ వినయ్‌భాస్కర్ తమ ప్రభుత్వ హయాంలో హాస్పిటల్లో పెరిగిన వసతులను తెలియజేసేందుకు ఈ అవకాశం వినియోగించుకున్నారు. ఐదు రోజుల తర్వాత ఎర్రబెల్లి, దాస్యం శుక్రవారం హాస్పిటల్‌కు వెళ్లి జడ్జి శాలినిని అభినందించారు. ఇక్కడి మేరకు బాగానే ఉంది.

మంత్రి, చీఫ్ విప్ సందర్శన సందర్భంగా శాలినిని అభినందిస్తూ మరోసారి కేసీఆర్ కిట్టు అందించడం గమనార్హం. ఒకరికి రెండు కిట్లు ఇచ్చారా? గతంలో ఇచ్చిన కిట్టునే ఫోటో కోసం మంత్రి, చీఫ్‌విప్ కలిసి అందించారా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడప్పుడు ఫోటో కోసం ఇలాంటి సంఘటన జరుగుతాయని గుర్తు చేస్తున్నారు. ఒకే పూల బొకెను మార్చి మార్చి ఇచ్చినట్లుగా అంటూ కొందరు సెటైర్ వేస్తున్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మంత్రి సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.