విధాత: అందరం కలిసి కట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తర,తమ బేధాలు మరిచి అందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపు ఇచ్చారు.
బుధవారం గాంధీ ఐడియాలోజి కేంద్రంలో నిర్వహిస్తన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్నిప్రారంభించారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2003లో ప్రజలు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. ఆ బాద్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు.
మనమంతా కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదని స్పష్టం చేశారు. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదని, అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దామన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళదామని రేవంత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామన్నారు.
ప్రతి గడపకు రాహుల్ సందేశం
ప్రతి గడపకు రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకువెళ్లి, ప్రజలకు చేరవేయాలని రేవంత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు.
ఓటర్ లిస్ట్‌లో పేరు తొలగిస్తే తిరిగి చేర్పించండి
ఓటర్ లిస్ట్‌లో కుట్ర పూరితంగా కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, అలా తొలగించిన చోట తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు రేవంత్ స్పష్టం చేశారు.
దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని రేవంత్ విమర్శించారు. పైగా అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ లకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
దేశానికి మంచి నాయకత్వాన్ని అందించిన సోనియా
సోనియా గాంధీ దేశానికి మంచి నాయకత్వాన్ని అందించారని రేవంత్ తెలిపారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదన్నారు. పదవులతో సంబంధం లేకుండా సోనియా దేశం కోసం పని చేశారన్నారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు.
దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారన్నారు. జనవరి 26న జెండా ఎగిరేయడంతో బాధ్యత తీరలేదన్నారు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అన్ని రాష్ట్రాలలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించిందన్నారు.
బాపూజీ ఆశయాలను తుంగలో తక్కిన బీజేపీ
అనేక మతాలు ఈ దేశంలో సహజీవనం సాగించాలన్న బాపూజీ ఆశయాలను బీజేపీ తుంగలో తొక్కిందని సీల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల లోపే పూజ్య బాపూజీ, జాతిపిత మహాత్మా గాంధీని చంపి దేశంలో ఆనాడే బీజేపీ విష భీజాన్ని నాటిందన్నారు.
మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి, దేశాన్ని విభజించి, రక్తపాతం సృష్టించి, బీజేపీ రాజకీయ అధికారం పొందాలని చూస్తున్నదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ చేస్తున్న విధానాలను ఎండగట్టడానికే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు.
స్వాతంత్ర భారతంలో కల్లోలం సృష్టిస్తున్న బీజేపీ కపటబుద్ధిని తన పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని ప్రతీ కార్యకర్త కదిలి వచ్చి కాంగ్రెస్ ఆలోచనలు, మూల సిద్ధాంతాలను జోడో యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లారని తెలిపారు.
భారత్ జోడో యాత్ర ముగింపును కొనసాగిస్తూ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా చేపడుతున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేద్దామన్నారు. ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 26 నుంచి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని తీసుకువెళ్లాలన్నారు.
ఇదే పనిగా రాష్ట్రంలోని కార్యకర్తలు అందరూ పని చేయాలని పిలుపు ఇచ్చారు. 2003లో వైయస్సార్ నిర్వహించిన పాదయాత్ర ఈ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన జరగడానికి నాటి వైయస్సార్ పాదయాత్ర దోహదపడిందన్నారు.
వైయస్సార్ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మార్పు తీసుకురావడం కోసం మనం పని చేద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ రెవెన్యూ విధానానికి అతిపెద్ద ప్రమాదకరమని భట్టి తెలిపారు.
ధరణి వల్ల రాష్ట్రంలో ఉన్న పేదలు, మధ్యతరగతి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధరణి తీసుకువచ్చినప్పుడే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని, ధరణిని రద్దు చేయాలని అసెంబ్లీలో గలాన్ని వినిపించానన్నారు.
ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కోసం నిర్వహిస్తున్న ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు