ఆప్‌ను అణచివేయడం.. బలవంతపు వసూళ్లకు పాల్పడటం.. ఈడీ లక్ష్యం ఇదేనన్న కేజ్రీవాల్‌

ఆప్‌ను అణచివేసి, దోపిడీ రాకెట్‌ను సృష్టించడమే ఈడీ ఉద్దేశాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. గురువారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు.

  • Publish Date - March 28, 2024 / 10:34 AM IST

న్యూఢిల్లీ: ఆప్‌ను అణచివేసి, దోపిడీ రాకెట్‌ను సృష్టించడమే ఈడీ ఉద్దేశాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. గురువారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. ‘ఈడీకి రెండే ఉద్దేశాలు.. ఒకటి ఆప్‌ను అణచివేయడం, రెండోది పొగల తెరలు సృష్టించి, బలవంతపు వసూళ్ల రాకెట్‌ను నడిపించి, దాని ద్వారా దోపిడీ చేయడం’ అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. వంద కోట్ల ‘ఢిల్లీ లిక్కర్‌ స్కాం’ అని ఈడీ అధికారులు చెబుతున్న అంశాన్ని ప్రస్తావించిన కేజ్రీవాల్‌.. ఆ సొమ్ము జాడలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ‘ఢిల్లీ మద్యం పాలసీలో వంద కోట్ల కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. డబ్బు జాడ ఇంకా కనుగొనలేదని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా అంటున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడ ఉన్నది? ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాతే అసలు కుంభకోణం మొదలైంది’ అని కేజ్రీవాల్‌ చెప్పారు. ‘రాఘవరెడ్డి బీజేపీకి 55 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయన తన బెయిల్‌ను కొనుగోలు చేసుకున్నారు. కుంభకోణం సొమ్ము జాడలు స్పష్టంగా ఉన్నాయి’ అని కేజ్రీవాల్‌ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆరు రోజుల కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను గురువారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు హాలులో కేజ్రీవాల్‌ భార్య సునీత, మంత్రి ఆతిషి, ఆప్‌ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వాదనలు వినిపిస్తూ.. ‘ఈడీ రిమాండ్‌ పిటిషన్‌ను నేను వ్యతిరేకించడం లేదు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నన్ను వారు కస్టడీలో ఉంచుకోవచ్చు. కానీ.. ఇది ఒక కుంభకోణం’ అని చెప్పారు.

20వేల పేజీలతో కేసు ఫైల్‌లో 4 స్టేట్‌మెంట్లలో నా పేరు

అసలు తన అరెస్టుకు అవకాశమే లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ‘ఈ కేసు రెండేళ్లుగా నడుస్తున్నది. నన్ను అరెస్టు చేశారు. నన్ను ఏ కోర్టూ దోషిగా తేల్చలేదు. సీబీఐ 31వేల పేజీలతో కేసు ఫైల్‌ చేసింది. 290 మంది సాక్షులను విచారించింది. ఈడీ 20వేలకుపై పేజీలతో కేసు ఫైల్‌ చేసింది. అందులో నా పేరు నలుగురు వ్యక్తులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో మాత్రమే ఉన్నది. ఒక ముఖ్యమంత్రి అరెస్టు చేయడానికి నలుగురు వ్యక్తులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు సరిపోతాయా?’ అని ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన వ్యక్తులు బలవంతం మీద స్టేట్‌మెంట్లను మార్చుకుంటున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అంతకు ముందు జైలు నుంచి ప్రభుత్వం నడవజాలదని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యల గురించి కోర్టు హాలు వద్ద కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా.. ఇది రాజకీయ కుట్ర అని, ప్రజలు తగిన విధంగా సమాధానం చెబుతారని అన్నారు. 


కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలి


ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్‌, ఎంపీ మనోజ్‌ తివారి చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలను ఆప్‌ నేతల్లో ఎవరన్నా చేపట్టాల్సి ఉండిందని అన్నారు.


‘ఢిల్లీ ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నది. ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల పట్ల ఆప్‌ నేతలకు కనీస ఆలోచన ఉన్నా ఆప్‌ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునేవారు’ అని వ్యాఖ్యానించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిన ఉదంతం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. కేజ్రీవాల్‌కు నైతికత ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జైలు నుంచి పనిచేయడం చట్టబద్ధమే అయితే మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు.


కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ పొడిగింపు


సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ రూస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ మరో ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని ఈడీ కోరింది. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్‌పై గురువారం వాదోపవాదాలు సాగాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కేజ్రీవాల్ స్టేట్‌మెట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెప్తున్నారని ఈడీ ఆరోపించింది. ఆప్‌ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సివుందని, అలాగే పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని, కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని ఈడీ కోరింది.

Latest News