Arvind Kejriwal । రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో సొంతబలం పైనే పోటీ చేయనున్నది’ అని ఆయన తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అయితే.. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థుల చేతిలో కూటమి పార్టీల అభ్యర్థులు ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి. అయినా విడిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలకూ లాభం చేకూరలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసే ఆలోచనల్లో తమ పార్టీ లేదని ఆప్ కన్వీనర్ ప్రకటించిన వారం రోజుల వ్యవధిలో తాజా ప్రకటన వెలువడింది. గతంలో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నాయని వార్తలు వచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. మరోసారి ఆప్ విజయం సాధిస్తే అది హ్యాట్రిక్ అవుతుంది. 2015లో 67 సీట్లను, 2020లో 62 సీట్లను ఆప్ గెలుపొందింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 20 మంది పేర్లతో కూడిన రెండో జాబితాను ఆప్.. సోమవారం విడుదల చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గతంలో పత్పార్‌గంజ్ నుంచి పోటీ చేయగా.. తాజాగా జంగ్‌పుర నుంచి బరిలో దిగనున్నారు. పొత్తులపై కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్.. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఒకటి లేదా రెండు సీట్లను గెలుచుకుని ఉండేదని వ్యాఖ్యానించారు. ఆప్ ప్రభుత్వ వ్యతిరేకత భారాన్ని తామెందుకు మోయాలని ఆయన ప్రశ్నించారు.