By Polls Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ ఊరట లభించింది. పంజాబ్‌లోని లూధియానా వెస్ట్‌తోపాటు.. బీజేపీ కంచు కోట గుజరాత్‌లోని విశావదర్ స్థానంలో జెండా ఎగరేసి.. అధికార పార్టీని కంగుతినిపించింది. కేరళలోని నీలంబర్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించగా.. బెంగాల్‌లో కలిగంజ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టుకున్నది. ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. అన్నింటిలోనూ పోటీ చేసిన బీజేపీ.. గుజరాత్‌లోని కడి స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్‌కు ఈ విజయాలు కొత్త బలాన్నిచ్చినట్టయింది. మరోవైపు బీజేపీకి తీవ్ర నిరాశలే మిగిలాయి. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పంజాబ్‌లో.. లూథియానా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలను ఆప్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు కీలక నేతలు మనీశ్ సిసోడియా, అతిషి వంటివారు కేంద్రీకరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తం ప్రచారాన్ని కేజ్రీవాల్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. కేరళలోని నీలంబర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ పరిధిలో నీలంబర్ ఉంటుంది. పశ్చిమబెంగాల్, కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ విజయాలు కేంద్రంలో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి బలాబలాలను పరీక్షించినట్టయింది. మరోవైపు గుజరాత్‌లో ఆప్ బోణీ కొట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
కేరళ
యూడీఎఫ్ తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ వామపక్ష కూటమి అభ్యర్థి ఎం స్వరాజ్‌పై 11వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి షౌకత్ తండ్రి అర్యదన్ మహ్మద్ వరుసగా ఎనిమిదిసార్లు విజయం సాధించారు. షౌకత్‌కు 77,737 ఓట్లు లభించగా.. ఎం స్వరాజ్‌కు 66,660 ఓట్లు వచ్చాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న కేరళలో వామపక్షాలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం వామపక్షాలకు పట్టున్న ప్రాంతం. వయనాడ్ పరిధిలోని నియోజకవర్గం కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్రీకరించి పనిచేశారు. వామపక్షాల మద్దతు ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్.. ముఖ్యమంత్రి విజయన్‌తో అభిప్రాయ బేధాల నేపథ్యంలో రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్క బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది మోహన్ జార్జ్ పోటీ చేశారు.
పంజాబ్
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గాన్ని ఆప్ నిలబెట్టుకున్నది. మాజీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి భరత్ భూషణ్ అశుపై పదివేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఇక్కడి గెలుపు ఆప్‌కు కఠిన పరీక్షగా నిలిచింది. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. ఆప్ ఎమ్మెల్యే బస్సీ గోగి జనవరి నెలలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 1977లో ఈ నియోజకవర్గం ఏర్పడి దగ్గర నుంచి కాంగ్రెస్ ఆరు సార్లు ఇక్కడ విజయం సాధించింది. శిరోమణి అకాలీదళ్ రెండు సార్లు గెలిచింది. ఇక్కడ బీజేపీ ఎన్నడూ విజయం సాధించింది లేదు. ఈ రెండు సీట్లలోనూ గతం కంటే రెట్టింపు మెజార్టీతో కైవసం చేసుకున్నామని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎక్స్ లో తెలిపారు. తమ ప్రభుత్వం పనితీరు పట్ట పంజాబ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ గెలుపు రుజువు చేస్తున్నదని చెప్పారు. గుజరాత్ ప్రజలు బీజేపీ పాలనపై విసుగెత్తిపోయారని, ఆప్‌లో ఆశలు చూశారని ట్వీట్ చేశారు.
గుజరాత్
ఆప్ గుజరాత్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా.. సంచలన విజయం నమోదు చేశారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కిరిట్ పటేల్‌పై విశావదర్ నియోజకవర్గంలో 17వేలకుపై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇటాలియాకు 75,942 ఓట్లు లభించాయి. 2007 తర్వాత బీజేపీ ఇక్కడ విజయం సాధించింది లేదు. ఈసారైనా గెలవాలనుకున్న బీజేపీ ఆశలు ఫలించలేదు. రాష్ట్రంలో పాటిదార్ ఉద్యమం సమయంలో పటేల్ తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యే భూపేంద్ర భయాని ఆప్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇదే రాష్ట్రంలోని కడి (ఎస్సీ) నియోజకవర్గాన్ని బీజేపీ నిలుపుకొన్నది. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 30వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఫిబ్రవరి నెలలో బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకి మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది.
పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కాళీగంజ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిలుపుకొన్నది. ఇక్కడ అలీఫా అహ్మద్ 50వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలీఫా తండ్రి, ఇక్కడి ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ ఫిబ్రవరి నెలలో మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీ తన అభ్యర్థిగా అశీశ్ ఘోష్‌ను నిలబెట్టింది. ఈ గ్రామీణ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 54 శాతం ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ తృణమూల్ గెలుపు.. ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.