Site icon vidhaatha

CM Camp Office | సీఎం బంగ్లాలో రూ. 60 ల‌క్ష‌ల‌తో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు..! టీవీలు, ఏసీల‌కే అధిక కేటాయింపులు..!!

CM Camp Office | న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం( BJP Govt ) కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ సీఎం రేఖ గుప్తా( CM Rekha Gupta )కు రాజ్ నివాస్ మార్గ్‌( Raj Niwas Marg )లోని బంగ్లా నంబ‌ర్ 1, 2ను కేటాయించారు. ఇందులో నంబ‌ర్ 1 బంగ్లాను అధికారిక నివాసానికి, నంబ‌ర్ 2 బంగ్లాను క్యాంప్ ఆఫీస్‌( CM Camp Office )గా వినియోగించేందుకు సీఎం సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం సీఎం గుప్తా త‌న సొంతిల్లు శాలీమ‌ర్ బాగ్ హౌస్‌( Shalimar Bagh house )లో నివాస‌ముంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా 1, 2ను పునరుద్ధ‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రూ. 60 ల‌క్ష‌ల‌తో పునరుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు టెండ‌ర్ నోటీసులు కూడా జారీ చేశారు. జులై 4వ తేదీన టెండ‌ర్లు ఓపెన్ కానున్నాయి. ఇక పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కేవ‌లం 60 రోజుల్లోనే పూర్తి చేయాల‌ని అధికారులు పేర్కొన్నారు.

పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల్లో అధికంగా టీవీలు, ఏసీల‌కే నిధులు కేటాయించారు. ముఖ్య‌మంత్రి ఇంట్లో రూ. 9.3 ల‌క్ష‌లతో ఐదు టీవీలు, రూ. 7.7 ల‌క్ష‌లతో 14 ఏసీలు, రూ. 5.74 ల‌క్ష‌లతో 14 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని టెండ‌ర్ నోటీసుల్లో పేర్కొన్నారు. రూ. 2 ల‌క్ష‌ల‌తో యూపీఎస్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. అద‌నంగా రిమోట్ కంట్రోల్‌తో ప‌ని చేసే 23 సీలింగ్ ఫ్యాన్లు(రూ. 1.8 ల‌క్ష‌లు), ఒక ఓవెన్ టోస్ట్ గ్రిల్(రూ. 85 వేలు), ఒక ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌(రూ. 77 వేలు), ఒక డిష్ వాష‌ర్‌(రూ. 60 వేలు), గ్యాస్ స్ట‌వ్(రూ. 63 వేలు), మైక్రోవేవ్స్‌(రూ. 32 వేలు), ఆరు గిజ‌ర్లు(రూ. 91 వేలు) ఏర్పాటు చేయాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక రూ. 6,03,939తో 115 ల్యాంప్స్, హ్యాంగింగ్ లైట్స్, మూడు చాందిలీయ‌ర్స్ ఏర్పాటు చేయాల‌న్నారు.

ఈ టెండ‌ర్ నోటీసుల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ప‌రిపాల‌న చేసేందుకు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా..? అని ఆప్ నేత‌లు నిల‌దీస్తున్నారు.

Exit mobile version