Site icon vidhaatha

Saptha Sagaralu Dhaati | మొన్న కేజీఎఫ్‌, నిన్న కాంతార, నేడు సప్త సాగరాలు దాటి.. తెలుగు ప్రేక్షకుల కోసం క్లాసిక్ లవ్ స్టోరీ

Saptha Sagaralu Dhaati |

‘కాంతార’ తరహాలో ఈ సినిమా కూడా ప్రభంజనం సృష్టిస్తుందా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌తో పాటు ఎక్కువగా వినిపిస్తున్న ఇండస్ట్రీ కన్నడ సినీ ఇండస్ట్రీ. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు, ‘కాంతార’ వంటి చిత్రాలు కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రేక్షకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారికి భాషతో సంబంధం లేదు.. కంటెంట్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా నెత్తిన పెట్టుకుంటారనే దానికి ఈ మధ్య చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

అందుకే ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలకి కూడా టాలీవుడ్ చక్కటి ఆదాయ వనరుగా మారింది. ‘కెజియఫ్’, ‘కాంతార’, ‘జైలర్’, ‘జవాన్’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరించారో తెలియంది కాదు. అలాంటి ప్రేక్షకుల ముందుకు ఓ క్లాసిక్ లవ్ స్టోరీ వస్తే.. ఎలా ఉంటుందో ఇంకొన్ని గంటల్లో తెలిసి పోనుంది. విషయంలోకి వస్తే..

‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ చిత్రంగా దూసుకెళుతోంది. విడుదలైన ప్రతి చోటా అధ్బుతమైన స్పందనను రాబట్టుకుంటుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా.. క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుని.. అద్భుతంగా థియేటర్లలో రన్ అవుతోంది.

ఇప్పుడీ సినిమాని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌తో సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకురాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటుండటంతో.. ఈ సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో ‘కాంతార’లా కలెక్షన్ల వర్షం కురిపించడం కాయం అనేలా అప్పుడే టాక్ మొదలైంది.

వాస్తవానికి రక్షిత్ శెట్టి సినిమా అనగానే అందులో ఎంతో కొంత కంటెంట్, కాదు కాదు కొత్త కంటెంట్ ఉంటుందనేలా అతను పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఆయన సినిమాలకు ఏదో ఒక రూపంలో అవార్డులు వరిస్తూనే ఉంటాయి. తాజాగా ‘777 చార్లీ’ నేషనల్ అవార్డ్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న ‘సప్త సాగరాలు దాటి’ ‘సైడ్‌ A సినిమా కూడా.. రియలిస్టిక్ కథలా అనిపిస్తుంది.

అలాగే, ఇందులో ఓ మంచి ప్రేమకథ దాగి ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఈ తరహా చిత్రం వచ్చి.. టాలీవుడ్‌లో చాలా కాలమే అవుతుంది. ఈ లెక్కన చూస్తే.. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించే అవకాశమే కనిపిస్తుంది. అదే జరిగితే.. మరో కన్నడ సినిమా టాలీవుడ్‌లో విజయదుంధుబి మోగించడం పక్కా అని ఫిక్సయిపోవచ్చు. అయితే ఈ సినిమాలో మొదటి భాగం సైడ్‌ ఏగా సెప్టెంబర్‌ 22న విడుదల అవుతుండగా ఆక్టోబర్‌ 27న సైడ్‌ బీ విడుదల చేయనున్నారు.

Exit mobile version