Indian Railways : రైల్వే లో భారీగా నకిలీ ఐడీలు రద్ధు

రైల్వే టికెట్ రిజర్వేషన్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు, ఐఆర్‌సీటీసీ (IRCTC) గత 12 నెలల్లో 3.02 కోట్లకు పైగా నకిలీ, అనుమానాస్పద ఐడీలను రద్దు చేసింది. బ్రోకర్లు ఆటోమేటెడ్ బాట్స్ సాయంతో అధిక ధరలకు తత్కాల్ టికెట్లు విక్రయిస్తున్నట్లు తేలింది.

Indian Railways Blocks Fake ID'S

విధాత, హైదరాబాద్ :  దేశంలో కొన్ని దశాబ్ధాలుగా రైల్వే టికెట్ రిజర్వేషన్ లో అక్రమార్కుల హవా నడుస్తోంది. వారికి వెన్నుదన్నుగా రైల్వే ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. సాధారణ రైల్వే టికెట్, టికెట్ రిజర్వేషన్ లో పెద్ద ఎత్తున గోల్ మాల్ నడుస్తోంది. కొందరి ప్రయాణీకుల బలహీనతలను బ్రోకర్లు ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది ప్రయాణీకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చుని ఆన్ లైన్ లో రిజర్వేషన్ టికెట్ బుక్ చేసినా దొరకడం లేదు. టిక్కెటింగ్ విధానంపై లక్షల కొద్దీ వస్తున్న ఫిర్యాదులను కేంద్ర రైల్వే మంత్రిత్వ సీరియస్ గా తీసుకున్నది. టికెట్ జారీ విధానంలో మొబైల్ ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి తొలుత రిజర్వేషన్ వరకే పరిమితం చేసింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తాజాగా సాధారణ టికెట్ జారీలో (కౌంటర్ల వద్ద) ఓటీపీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

గత సంవత్సర కాలంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ.ఆర్.సీ.టీ.సీ) అనుమానాస్పద ఐడీలపై కన్నేసింది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు అనుమానాస్పదంగా, అక్రమంగా కొనసాగుతున్న ఐడీలు మూడు కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. మొత్తం 3.02 కోట్ల ఐడీ లను డీయాక్టివేట్ చేసింది. దేశంలోని రైల్వే టికెట్ బ్రోకర్లు ఆటోమెటెడ్ బాట్స్, నకిలీ సాఫ్ట్ వేర్ సాయంతో నకిలీ ప్రయాణీకుల ప్రొఫైల్స్ తయారు చేసి తత్కాల్ టికెట్లు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని విచారణలో వెల్లడి అయ్యింది. నిజమైన ప్రయాణీకులకు సేవలు అందించేందుకు యాంటి బాట్ టెక్నాలజీ (అకమయి) ను ప్రయోగించి నకిలీలను ఏరివేస్తున్నారు. 2015 లో తొలిసారి 322 రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఓటీపీ విధానాన్ని తీసుకువచ్చారు. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ కోసం ఓటీపీ విధానం తెచ్చారు. ప్రయాణీకుల భద్రత, రక్షణ కోసం రైల్వే ఆన్ లైన్ వెబ్ ఫోర్టల్ లో అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ఫైర్ వాల్స్, వెబ్ అప్లికేషన్లను ప్రవేశపెట్టి సిసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. టికెట్ల జారీ పై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెర్ట్ ఇన్ తో ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ ఆడిట్ కూడా జరుగుతోందన్నారు. ఆన్ లైన్ లో టికెట్ జారీ విధానం లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, సైబర్ దాడులను నిరోధంచేందుకు సెర్ట్ ఇన్ తో పాటు నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రా స్ట్రక్షర్ ప్రొటెక్షన్ సెంటర్ లు సంయుక్తంగా పనిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Chiranjeevi | అవమానాన్ని విజయానికి మెట్టుగా మార్చుకున్న చిరంజీవి.. అభిమానులను కదిలించిన సంఘటన

Siricilla Weaver Crafts QR Shawl : సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. శాలువాపై క్యూఆర్ కోడ్

Latest News