IRCTC | హైదరాబాద్ : నిత్యం రైళ్లల్లో ప్రయాణికులకు ముఖ్య గమనిక. అదేంటంటే.. 2026 జనవరి 1వ తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే గతంలో ప్రతి ఏడాది జులై 1వ తేదీ నుంచి కొన్ని రైళ్ల వేళలను మార్చేవారు. కానీ ఇప్పుడు ఆ సవరణను ఓ ఆరు నెలల ముందుకు తీసుకొచ్చారు. అంటే జనవరి 1వ తేదీ నుంచి రైళ్ల వేళల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
దేశ వ్యాప్తంగా 1400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ 80కి పైగా రైళ్ల వేళలు మారబోతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్ఠంగా 30 నిమిషాల వరకు రైళ్ల వేళలను మారుస్తున్నారు. ఈ మారిన రైళ్ల సమయాలను త్వరలోనే ఐఆర్‌సీటీసీ( IRCTC ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి ప్రయాణాలు ఉన్న వారు మారిన రైళ్ల వివరాలను తెలుసుకుని తదనుగుణంగా స్టేషన్‌కు చేరుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ వెల్లడించారు. జనవరి 1వ తర్వాత ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు, వారు ప్రయాణించాల్సిన రైళ్ల వేళలు మారితే, ఆ సమాచారాన్ని మెసేజ్ రూపంలో సదరు ప్రయాణికులకు పంపుతామని తెలిపారు.
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో కొన్ని నెలల పాటు విడతల వారీగా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేయనున్నారు. తాజా మార్పులు కూడా దీని ప్రభావం చూపనుంది. సికింద్రాబాద్‌లో పనుల నేపథ్యంలో చాలా రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడుపుతున్నారు. త్వరలోనే మరిన్ని రైళ్లు అక్కడ్నుంచే పరుగులు పెట్టనున్నాయి. దీంతో కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
