Kidney
విధాత: కుక్కలంటే మనతో సరదాగా గడుపుతాయనో, మనం చెప్పినట్టు వింటాయనో అనుకుంటాం. కానీ.. ఈ కుక్కల తన యజమానికి అలాంటి ఇలాంటి సాయం చేయలేదు. ఆమెకు పునర్జన్మనిచ్చింది. ఈ కుక్కే లేకుంటే నా జీవితం ఏమైపోయి ఉండేదో అని ఆమె ఆప్యాయంగా తన కుక్కను నిమురుతున్నది.
విషయం ఏమిటంటే.. కుక్క యజమానురాలికి అరుదైన కిడ్నీ వ్యాధి ఉన్నది. ఎవరైనా కిడ్నీ(Kidney) దానం చేస్తే తప్ప బతికే పరిస్థితి లేదు. కిడ్నీ మార్పిడి పెద్ద పనేంకాదు కదా! అనుకోవచ్చు. కానీ.. ఆమెకు తగిన కిడ్నీ 22 మిలియన్ల మందిలో ఒక్కరి వద్ద ఉంటుందట! అంతటి అరుదైన కిడ్నీ దాతను పట్టుకోవడం సాధ్యమేనా? కానీ.. ఆ పని డాబర్‌మాన్ జాతికి చెందిన తన పెంపుడు కుక్క చేసి పెట్టింది. నమ్మలేం కానీ.. నిజమండీ!
లూసీ హంఫ్రీ అనే మహిళ అరుదైన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నది. ఆమెకు ఇంకా ఐదేళ్లే జీవిత కాలమని డాక్టర్లు తేల్చేశారు. ఆమె దగ్గర డాబర్‌మాన్ జాతికి చెందిన జేక్, ఇండీ అనే రెండు కుక్కలు ఉన్నాయి. వాటిని తీసుకుని లూసీ ఒక రోజు సౌత్‌వేల్స్‌లోని బీచ్‌కు వెళ్లింది.
కాసేపు బాగానే ఉన్న ఇండీ.. తన యజమానురాలిని వదిలేసి.. తనకు వంద అడుగుల దూరంలో ఉన్న కేటీ జేమ్స్ అనే మహిళ వద్దకు వెళ్లిపోయి ఆమె కాళ్లను నాకుతూ కూర్చుండి పోయింది. ఇది గమనించిన యజమానురాలు యజమానురాలి ఆ కుక్కను పట్టుకునేందుకు అక్కడికి వెళ్లి అది చేసిన పనికి ఆమెకు క్షమాపణలు చెప్పింది.
కేటీ జేమ్స్ అనే అపరిచిత మహిళతో లూసీ మొదటిసారిగా మాటలు కలిపి కాసేపు ముచ్చట్లు చెప్పుకొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం లూసీ కేటీ జేమ్స్‌ను తన టెంట్ వద్దకు ఆహ్వానించగా ఆమె వస్తూ వస్తూ ఒక బాటిల్ డ్రింక్ తీసుకు వచ్చి లూసీకి ఆఫర్ చేయగా ఆమె డయాలసిస్‌పై ఉన్నదని, మద్యం తీసుకోవడం లేదని లూసీ భర్త కేటీకి చెప్పాడు.
దీంతో ఎవరైనా దాత ముందుకు వచ్చి కిడ్నీ ఇస్తేనే గానీ లూసీ బతకదని కేటీకి అర్థమైంది. కాసేపటి తర్వాత తాను తన కిడ్నీని దానం చేసేందుకు రిజిస్టర్ చేయించుకోవడానికి వెళుతున్నానని, లూసీకి కిడ్నీ దానం చేసేందుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని కేటీ చెప్పింది.
ఈ సందర్భంగా లూసీ మాట్లాడుతూ ‘కేటీ అన్ని పరీక్షలూ చేయించుకోగా కిడ్నీ ఇచ్చేందుకు తగిన వ్యక్తి అని రూఢీ అయ్యింది. ఇది నిజంగా అద్భుతం. నా పెంపుడు కుక్క(ఇండీ) సరిగ్గా నాకు కావాల్సిన కిడ్నీ దాత వద్దకు వెళ్లింది. ఇంత పక్కాగా కిడ్నీ లభించడం ప్రతి 22 మిలియన్ల మందిలో ఒక్కరికే సాధ్యమవుతుందని నా డాక్టర్ చెప్పారు. నాకు సరిగ్గా అలాంటి కిడ్నీ కావాలి.. అదే దొరికింది’ అని లూసీ డైలీ మెయిల్ పత్రికకు చెప్పుకొని భావోద్వేగానికి గురైంది.
నిజానికి లూసీ, ఆమె భర్త సెనిడ్ ఒవెన్ తమ వీకెండ్ బ్రేక్ కోసం అబెరిస్టివి బీచ్‌కు వెళ్లానుకున్నా.. లూసీ అంతదూరం ప్రయాణించ లేనని చెప్పడంతో సౌత్‌వేల్స్ బీచ్ వద్ద ఆగారు.. అక్కడే ఆమెకు పునర్జన్మను ఇండీ అందించింది. అనంతరం లూసీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు.