Site icon vidhaatha

Padi Kaushik Reddy | డబ్బులివ్వాలని క్వారీ యజమానికి బెదిరింపులు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Padi Kaushik Reddy |

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఎప్పుడూ ఏదో రూపంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో కౌశిక్ రెడ్డి పై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న కట్టా మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తమను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని, మళ్ళీ మొన్న ఫోన్ చేసి రూ. 50 లక్షలు చెల్లించాలని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తన భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యారని, తమకు న్యాయం చేయాలని ఉమాదేవి ఆ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదు పై స్పందించిన సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి.

శ్రీయత గౌరవనీయులైన యెస్.హెచ్.ఓ.. సుబేదారి పోలీస్ స్టేషన్ గారికి
తేదీ: 21-04-2025.

విషయము:- శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, యం.ఎల్.ఎ. గారి బెదిరింపులు, దౌర్జన్యం – అక్రమంగా డబ్బుల డిమాండ్ -భూతులు – ప్రాణ భయం విచారణ చర్య నిమిత్తం. నేను అనగా శ్రీమతి కట్టా ఉమాదేవి, భర్త: మనోజ్ రెడ్డి, వయస్సు: 54 సం||లు, వృత్తి: గృహిణి, కులం: రెడ్డి, నివాసం: ఇం.నెం.2-7-741, ఎక్సైజ్ కాలనీ, హన్మకొండ గారిని తెలియజేయు వ్రాతపూర్వక ఫిర్యాదు ఏమనగా! నా భర్త శ్రీ కట్టా మనోజ్ రెడ్డి గారు గత 20 రోజులుగా తీవ్రమైన మనోవేధనతో, మానసిక ఆందోళనతో, భయం భయంగా కనిపిస్తుండగా వారిని వారి ప్రవర్తన గురించి ఈ రోజు ప్రశ్నించగా, హుజురాబాద్ యం.ఎల్.ఎ. శ్రీ పాడి కాశిక్ రెడ్డి గారు గతంలో నా భర్త దగ్గర బెదిరించి రూ.25,00,000/- (అక్షరాలా ఇరవై ఐదు లక్షల రూపాయలు) తీసుకున్నారు. మళ్ళి నీకు సంబందించిన గ్రానైట్ క్వారి నా నియోజకవర్గములో నడవాలంటే (వంగపెళ్లి, మండలం కమలాపూర్) తేదీ: 18-04-2025 రోజు మధ్యాహ్నం 1-00 గంట ప్రాంతములో తన ఫోన్ నెం. 9949219999 ద్వారా నా భర్త సెల్ ఫోన్ నెం. 9959513366 కి ఫోన్ చేసి నానా విధాలుగా భూతులు తిట్టుచూ, అక్రమంగా తనకు తక్షణమే రూ. 50,00,000/- (అక్షరాల యాభై లక్షలు) కావాలని బెదిరింపులకు పాల్పడుతూ. తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు చెల్లించక పోతే నా భర్తను మరియు నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించగా, వారి చర్యల వలన నా భర్త తీవ్ర మానసిక వేధనకు గురై ఆందోళనతో జీవనం గడుపుచున్నారు. ఒక గౌరవ యం.ఎల్.ఎ. గా యుండి, చట్టాలను తన చేతులలో తీసుకొని, ఇట్టి బెదిరింపులకు పాల్పడడం వలన నా భర్త క్షీణించి ఆరోగ్యం కుషించి మానసికంగా అనారోగ్యానికి గురి అవుచున్నారు. వీరి వలన నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.

అందువలన ఇతని / వీరి అసాంఘిక చర్యలవలన నాకు నా భర్తకు మరియు నా కుటుంబ సభ్యులకు ప్రాణ భయం, హాని యుంది. వీరి వలన మా భర్త ప్రాణానికి భవిష్యత్లో హాని ఉంది. అందువలన నా భర్తను అకారణంగా బెదిరింపులకు గురి చేస్తూ అక్రమంగా రూ.50,00,000/- (అక్షరాలా లక్షలు డిమాండ్ చేస్తూ, యివ్వని యెడల ప్రాణహాని చేపడుతానని, నానా భూతులు తిట్టుతూ, తీవ్ర భయభ్రాంతులకు గురి చేయుచున్న పై వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని ప్రార్ధన.

ఇట్లు
మీ విధేయురాలు,
(శ్రీమతి కట్టా ఉమాదేవి)
భర్త: మనోజ్ రెడ్డి

Exit mobile version