Telangana |
విధాత: తెలంగాణ రాష్ట్రంలో సంచలం రేపిన రూ.700కోట్ల గొర్రెల స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గొర్రెల స్కామ్ పై ఏసీబీ కేసు నమోదు తర్వాత మొయినుద్దీన్ తన కుమారునితో కలిసి దుబాయ్ పారిపోయాడు. తాజగా మొయినుద్ధీన దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో విమానాశ్రయంలో ఏ1 నిందితుడు మొయినుద్దీన్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెలను కొనుగోలు చేసి యజమానులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టినట్లుగా, నిధులను పక్కదారి పట్టించినట్లుగా ఆభియోగాలున్నాయి.
గొర్రెల పంపిణీలో ఏసీబీ దర్యాప్తులో రూ.700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని గుర్తించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. 10 మంది వరకు పశుసంవర్ధకశాఖ అధికారులతో పాటు అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌ను సైతం ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే కేసు నమోదు కాగానే మొయినుద్దీన్‌తో పాటు ఆయన తనయుడు ఇక్రమ్, మరో కీలక నిందితుడు విదేశాలకు పారిపోయారు. దీంతో వారిపై అప్పట్లోనే ఏసీబీ లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ చేసింది.
తాజాగా హైదరాబాద్ కు వచ్చిన మొయినుద్ధీన్ అరెస్టు చేశారు. గురువారం రాత్రి కోకాపేట్‌లోని మూవీటవర్‌లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అతడి ఖాతా నుంచి భార్య ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాలను తొలుత మొయినుద్దీన్ భార్య అడ్డుకుంది. సెర్చ్ వారెంట్ చూపించి అధికారులు శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల వరకు తనిఖీలు చేశారు. 2 కార్లను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు.