విధాత : రైతుబంధుపై కాంగ్రెస్, బీఆరెస్‌లు నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆరెస్, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలని, వాటి డీఎన్‌ఏ ఒక్కటేనని, కుటుంబ, అవినీతి, బుజ్జగింపు రాజకీయ లక్షణాలు ఆ రెండు పార్టీల లక్షణాలని విమర్శించారు. కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పటికీ వదిలిపెట్టదన్నారు.
బీజేపీ, బీఆరెస్‌లు ఒక్కటేనని చెప్పే వారిని చెప్పుతో కొట్టాలని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్‌గాంధీతో చర్చకు సిద్ధమన్నారు. పదేళ్లకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైన, పదేళ్ల బీఆరెస్ పాలనపైన తాము చర్చకు సిద్ధమన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హైద్రాబాద్ పేరును మార్చుతామని, హైదర్ ఎవరని, దేశంలో ఇప్పటికే పలు నగరాల పేర్లు మారాయన్నారు.
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చారన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో కేసీఆర్ పై గెలవబోతున్నారన్నారు. వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా, లక్ష మంది రాహుల్‌లు వచ్చినా, కోట్ల మంది ఓవైసీలు వచ్చిన 2024లో మళ్ళీ ప్రధాని మోడీనే అవుతారని, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మొదటిసారి ప్రధాని రోడ్ షో జరుగుతుందన్నారు.